రంగనాయకసాగర్ ప్రాజెక్టుతో రెండు జిల్లాలు సస్యశ్యామలం: కేటీఆర్

by Shyam |
రంగనాయకసాగర్ ప్రాజెక్టుతో రెండు జిల్లాలు సస్యశ్యామలం: కేటీఆర్
X

దిశ, మెదక్: రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ సిద్దిపేటకే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా సస్యశ్యామలం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడురు మండలం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్‌లో గోదారి జలాలను మంత్రి హరీశ్‌రావుతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చిరస్మరణీయ ఘట్టం తమ చేతుల మీదుగా ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు నియోజకవర్గాలకు శాశ్వతంగా సాగునీరు అందనుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా హరీశ్ రావు శ్రమించి పనిచేశారని గుర్తు చేశారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని మంత్రి కేటీఆర్ కొనియాడారు.

నా జన్మకు ఇది చాలు: మంత్రి హరీశ్ రావు

రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి నీళ్ళు రావటంతో ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని బీడు బారిన 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ జన్మకు ఇంతకంటే కావల్సింది ఏమీలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసాధ్యమని విమర్శించిన నోళ్లు నేడు మూతపడ్డాయని, ఈ ప్రాజెక్టు నిర్మాణం అతితక్కువ సమయంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్యేలు రసమయి బాల్ కిషన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఓడితల సత్తీష్, రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ లు, కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Ranganayaka sagar Project, KTR, Harish Rao, Comments, Siddipet

Advertisement

Next Story

Most Viewed