ఎన్నికలు ఏవైనా.. గెలుపు టీఆర్ఎస్‌దే : కేటీఆర్

by Shyam |   ( Updated:2021-12-14 02:20:57.0  )
ktr1
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాకారం కోసం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పాలనకు, ప్రజలు ప్రతీ ఎన్నికలోనూ పట్టం కడుతున్నారన్నారు.

తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 12 స్థానాలకు గాను 12 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలతో స్థానిక సంస్థలు ఎంతగానో బలోపేతమయ్యాయని, ముఖ్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా స్థానిక సంస్థలకు ప్రతీనెల టంచన్‌గా నిధులను అందిస్తూ స్థానిక సంస్థలను ఆర్థికంగానూ బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి కార్యక్రమాల ఫలితంగానే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఘనమైన విజయం అందించారన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు అందరికీ అభినందనలు తెలిపిన కేటీఆర్, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed