ఈ నెల 8 నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనం

by Shyam |   ( Updated:2020-06-07 00:12:57.0  )
ఈ నెల 8 నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనం
X

దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఇక భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 8 నుంచి కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శన భాగ్యం భక్తులకు కలుగనుంది. హైదరాబాద్ లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కమిషనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా మార్గదర్శకాలను విడుదల చేశారు. లాక్ డౌన్ విధించడంతో 78 రోజులుగా భక్తులకు స్వామివారి దర్శనం లేకుండా పోయింది. స్వామివారి ఆలయ ప్రవేశంలో శానిటైజర్లు ఏర్పాటు, భౌతిక దూరం, భక్తుల శరీర ఉష్ణోగ్రత పరీక్షించేందుకు ధర్మల్ స్క్రీనింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో తరచూ ఆలయాన్ని శుభ్రం చేయాలని నిర్ణయించారు. కంటైన్మెంట్ జోన్ లో ఉన్నవారు దర్శనాలకు రావద్దని సూచించారు. అంతర ఆలయ దర్శనం, శఠగోపం తీర్థ ప్రసాద వితరణ, వసతి సౌకర్యం ఉండవని, ఆలయం వద్ద ఉన్న విక్రయ కేంద్రాల ద్వారా ప్రసాదాలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భక్తులందరూ ఆనంద పరవశంలో ఉన్నారు.

Advertisement

Next Story