తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం.. కరోనా హెల్త్ బులెటిన్ నిలుపుదల

by Sridhar Babu |   ( Updated:2020-07-21 23:20:31.0  )
తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం.. కరోనా హెల్త్ బులెటిన్ నిలుపుదల
X

ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కానీ బాధితుల సంఖ్యను వెల్లడించడంలో వైద్య శాఖ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ప్రతిరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేయడాన్ని సైతం నిలిపివేశారు. వారి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వందల సంఖ్యలో కేసులు నమోదువుతున్నా వాటిని దాచే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ గ‌ణ‌నీయంగా పెరుగుతున్నా… జిల్లా వైద్యా ఆరోగ్య‌శాఖ వాటిని బయటకు తెలియనివ్వడం లేదు. క‌రోనా విష‌యంలో గోప్యత ప‌నికి రాదన్న విష‌యం తెలిసి కూడా త‌మ వైఫ‌ల్యాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకు హెల్త్ బులెటిన్ విడుద‌లను ఆపేయ‌డం గ‌మనార్హం. అంతేకాక కేసుల సంఖ్య‌ను త‌క్కువ చేసి చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా హెల్త్ బులెటిన్ కు స్టేట్ బులెటిన్‌లో కేసుల సంఖ్య విష‌యంలో తేడాలుండ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. గాంధీచౌక్‌లో సోమ‌వారం ర్యాపిడ్ టెస్ట్ సెంట‌ర్‌లో 300ల‌కు పైగా మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 191మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇందులో గాంధీచౌక్ ప్రాంతానికి చెందిన వారే 180మంది ఉండ‌గా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ప‌ట్ట‌ణానికి చెందిన 11 మంది ఉన్నారు.

191 నమోదు కాగా 3 కేసులేనంటూ బులెటిన్

క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌ల‌మైన యంత్రాంగం, వైద్య‌శాఖ త‌మ వైఫ‌ల్యం బ‌య‌ట ప‌డకుండా ఉండేందుకు కేసుల వివ‌రాలు బ‌య‌ట‌కు రానివ్వడం లేదు. అందులో భాగంగానే హెల్త్ బులెటిన్ విడుద‌ల చేయ‌కుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర్యాపిడ్ టెస్టులతో సోమ‌వారం ఒక్క‌రోజే 191 కేసులు న‌మోదైనా స్టేట్ బులెటిన్ కు 3కేసులుగా రిపోర్ట్ ఇవ్వ‌డం జిల్లా వైద్యా శాఖ అధికారులకే చెల్లింది. వాస్తవానికి, రిపోర్టుకు ఇంత తేడా ఉండటంతో క‌రోనా కేసుల విష‌యంలో గ‌తంలో వైద్య‌శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ల‌పై స‌ర్వ‌త్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. వైద్య‌శాఖ అధికారుల‌పై రాజ‌కీయ ఒత్తిళ్లు సైతం ఉన్నట్టు తెలుస్తోంది.

ప‌రీక్ష‌లు త‌క్కువ‌.. కేసులు ఎక్కువే..

వాస్త‌వానికి జిల్లాలో చాలా తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన రోగి కుటుంబ స‌భ్యులంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంది. అలాగే జ‌ర్నీ హిస్ట‌రీ ఆధారంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉన్నా జిల్లా వైద్య‌శాఖ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే అనేక మంది క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రుల‌కు చేరుకుంటున్నారు. వాస్త‌వానికి జిల్లాలో వైద్య‌శాఖ ప‌నితీరుపై క‌రోనా వైర‌స్ ఆరంభం నుంచే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జిల్లాలో క‌రోనా టెస్టులు.. ప‌రీక్ష‌ల ఫ‌లితాలు.. త‌దిత‌ర అంశాల‌పై డీఎంహెచ్‌వో మాల‌తిని వివ‌ర‌ణ కోరేందుకు దిశ ప్రతినిధి ఫోన్‌ చేయగా వారు స్పందించలేదు.

Advertisement

Next Story