కేసీఆర్ ధ్యాసంతా కుట్ర రాజకీయాలపైనే : మధుయాష్కీ గౌడ్

by Shyam |   ( Updated:2021-11-22 06:05:36.0  )
కేసీఆర్ ధ్యాసంతా కుట్ర రాజకీయాలపైనే : మధుయాష్కీ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కుట్ర రాజకీయాలు చేయడంపై కేసీఆర్‌కు ఉన్న దృష్టి రైతుల మీద లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాది ప్రాణత్యాగం చేసిన అమరవీరులపై కూడా ఆయనకు శ్రద్ధలేదన్నారు. కేసీఆర్ వ్యవహారం ‘మాటల్లో నవాబు.. చేతల్లో గరీబు అన్నట్లు’ గా ఉందని ఎద్దేవా చేశారు. రైతులకు, అమరవీరులకు ఎన్ని హామీలు ఇచ్చినా ఆచరణలో మాత్రం ఎక్కడి గొంగళి.. తరహాలోనే ఉన్నదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు అవసరమైన కనీస సదుపాయాలను ఏర్పాటు చేయడంలోనూ విఫలమయ్యారని ఆరోపించారు. ఉత్తరాది రైతు కుటుంబాలకు తలా రూ.3 లక్షల చొప్పున ఇస్తానన్న కేసీఆర్ తన సొంత రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని, తక్షణం ఆ పని చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కుప్పలపై ప్రాణాలు వదిలిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు.

తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు, కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయినవారికి, కేటీఆర్ నిర్వాకంతో ఆత్మహత్యలు చేసుకున్న 27 మంది ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్త వృద్ధాప్య పెన్షన్లు అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా ఉన్నదని, అర్హుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆసరా పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించినప్పటికీ కొత్తగా ఒక్కరికీ పింఛన్ రాలేదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 7.80 లక్షల దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తికాలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడే టార్పాలిన్లు, ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, శుభ్రంచేసే యంత్రాలు లేక అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వానాకాలం సీజన్‌లో 61.30 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అంచనాలున్నా దానికి అనుగుణమైన చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed