- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ కీలక ప్రకటన.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
దిశ, తెలంగాణ బ్యూరో : “మీరు అంటే మాకు అభిమానం. ఎన్నికలప్పుడు మీకే ఓట్లేస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు మా రుణం తీర్చుకునే సమయం వచ్చింది. మా మీద ప్రేమతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. అధికార పార్టీ ఓట్ల కోసం ఏదో ఓ పథకం తీసుకొస్తుంది. మేం బాగుపడుతాం… మిమ్మల్నీ మళ్లీ గెలిపించుకుంటాం..” అంటూ ప్రజలు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇలాంటి ప్రచారం వైరల్‌గా మారుతోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఇదే డిమాండ్ వస్తోంది. అక్కడా.. ఇక్కడా కాదు… మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఇదే చర్చ. కొంతమంది సెటైర్లు వేస్తుండగా.. మరికొంతమంది బహిరంగంగా.. సూటిగానే ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్‌ను ముందుంచుతున్నారు.
రాజీనామా చేయండి
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్ జనాలపై బాగానే పడింది. దీనికితోడు సోషల్ మీడియాలోనే అన్ని తెలియడంతో ఇప్పుడు ప్రజలు కూడా ఆ సామాజిక మాధ్యమాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయాలపై పదునైన వ్యాఖ్యలు.. కొత్తరకం నిరసనలకు దిగుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ ప్రజలపై ప్రభుత్వం వరాలు జల్లు కురిపిస్తోంది. ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీంతో జనం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ‘సార్ అభివృద్ధి కోసం రాజీనామా చేయండి’ అంటూ ప్రజలు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు.
మా లీడర్లు కూడా లక్షాధికారులు అవుతారు
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చిన చోట అధికార పార్టీ నుంచి కేసీఆర్ హద్దులకు మించి వరాల జల్లు కురిపిస్తుండటంతో ఇప్పుడు ఆ వరాల జల్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చుట్టుకుంటున్నాయి. దుబ్బాక, నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో ఆ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని చాలా పథకాలు మొదలుపెట్టారు. దీంతో ఉప ఎన్నికలు జరిగే నెల రోజులు పండుగ వాతావరణ నెలకొంది. తాజాగా ఇప్పుడు హుజూరాబాద్‌లోనైతే దళిత బంధు పథకంతో అక్కడి దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వనుంది. కొత్త పెన్షన్లు, కొత్త రోడ్లు, భవనాలు, డబుల్బెడ్రూం ఇండ్లు.. ఇలా చాలా పథకాలు అందుతాయి. మా నాయకులకు కూడా డిమాండ్ ఉంటుంది. ఇన్ని రోజులు చిన్నా చితక పనులు చేసుకున్న నేతలు కూడా ఒక్కసారిగా లక్షాధికారులు అవుతారు అంటూ తమ కోరికను సోషల్ మీడియాల్లో వెల్లడించుకుంటున్నారు.
మిమ్మల్ని గెలిపించుకుంటాం
“నియోజకవర్గంలో మీరు మా మీద ప్రేమతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయి. అధికార పార్టీ ఓట్ల కోసం ఏదో ఓ పథకం తీసుకొస్తుంది. మేం బాగుపడుతాం. దయచేసి మా కోరికను మన్నించి రాజీనామా చేయండి ప్లీజ్..” అంటూ సోషల్ మీడియాలో నియోజకవర్గ జనం పేరుతో డిమాండ్ఊపందుకుంది. ఎమ్మెల్యేల ఫొటోలతో ఈ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదని, రోడ్లు లేవని, డబుల్బెడ్ రూం ఇండ్లు ఇవ్వడం లేదని, రాజీనామా చేస్తే ఇవన్నీ వస్తాయని, ప్రజలకు కొత్త పథకాలు అందుతాయంటూ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రాజీనామా చేయాలనే డిమాండ్ వస్తోంది.