వామ్మో.. కరీంనగర్- వరంగల్ రోడ్డా..? ఇక అంతే

by Sridhar Babu |   ( Updated:2020-11-05 20:44:32.0  )
వామ్మో.. కరీంనగర్- వరంగల్ రోడ్డా..? ఇక అంతే
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వరంగల్- కరీంనగర్ రోడ్డు ఆరేండ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో అడుగడుగునా గంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కరీంనగర్ నుంచి వరంగల్ చేరుకోవాలంటే గంటన్నర పట్టిన సమయం.. ఇప్పుడు దాదాపు మూడు గంటలు పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. కొందరు ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్-కరీంనగర్ రోడ్డు పోశారు. గత ఆరేండ్ల నుంచి రిపేర్లు చేయకపోవడంతో గుంతల మయంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు మీదుగా వెళ్లడం మానేసిన కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. రహదారి అధ్వాన్నంగా తయారైనా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డును జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించడం లేదు. అయితే జాతీయ రహదారిగా గుర్తించిన తరువాత ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కాకుండా పోయింది. గంతలమయంగా మారిన ఈ రోడ్డును తాత్కాలికంగా రిపేర్ చేయాలన్న ఆలోచనలో అధికారులు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.

పట్టించుకోని యంత్రాంగం

కేంద్ర రహదారుల విభాగానికి చెందిన యంత్రాంగం ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన వారు వరంగల్, విజయవాడ వెళ్లాలంటే ఈ రోడ్డే దిక్కు. దీంతో నిత్యం వేలాది సంఖ్యల వాహనాల రాకపోకలు ఈ రోడ్డు గుండానే సాగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారయితే తాము గమ్యం చేరే వరకు క్షేమంగా ఉంటామా లేదా అనే భయంతో ప్రయాణిస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాల గుండా..

కరీంనగర్ నుంచి వరంగల్ ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. హుస్నాబాద్, ఎల్కతుర్తి మీదుగా వరంగల్ చేరుకుంటున్నారు. దూరం పెరిగినా గతుకుల రోడ్డు మీదుగా వెళ్లి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడంతో పాటు వాహనాలను బాగు చేయించుకునే పరిస్థితి ఎదురవుతుందని భావించి హుస్నాబాద్ మీదుగా వెళ్తున్నారు. హుజురాబాద్, కేశవపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు తప్పని సరై ఈ రోడ్డును ఆశ్రయిస్తున్నారు.

నేషనల్ హైవే అనుసంధానికి చొరవ..

తాను ఎంపీగా ఉన్నప్పుడు జాతీయ రహదారుల ఊసే లేని కరీంనగర్‌ను నేషనల్ హైవేకు అనుసంధానం చేయించేందుకు చొరవ తీసుకున్నానని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్ర రహదారుల శాఖ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయిస్తే ఆ ఆఫీసు సేవలు కూడా నేడు అందకుండా పోయాయని ఆరోపించారు. ఇటీవల కరీంనగర్, వరంగల్ రహదారిని వెంటనే బాగు చేయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ రహదారిని రిపేర్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed