ట్రంప్‌పై భగ్గుమన్న యూనివర్సిటీలు

by Anukaran |
ట్రంప్‌పై భగ్గుమన్న యూనివర్సిటీలు
X

వాషింగ్టన్: రానున్న సెమిస్టర్(సెప్టెంబర్-డిసెంబర్‌)లో భౌతికంగా కాలేజీలకు హాజరుకాని విదేశీ విద్యార్థులు తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేసిన ప్రకటనపై యూనివర్సిటీలు భగ్గుమన్నాయి. ఈ నిబంధనను వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే హార్వర్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

తాజాగా, ఇదే జాబితాలోకి బాల్టిమోర్‌లోని జాన్స్‌ హాప్కిన్స్ యూనివర్సిటీ(జేహెచ్‌యూ) కూడా చేరింది. జేహెచ్‌యూ కూడా ట్రంప్ సర్కారు నిర్ణయం చట్టవిరుద్ధమని, అమెరికా విధానాలకు వ్యతిరేకమని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫెడరల్ న్యాయస్థానంలో శుక్రవారం దావా వేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలోపెట్టుకుని చాలా వర్సిటీలు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. భౌతికంగా తరగతులకు హాజరైతే కరనా మహమ్మారి వ్యాప్తి చెందవచ్చనే కారణంగానే ఈ నిర్ణయాన్ని వర్సిటీలు తీసుకున్నాయి.

కానీ, ట్రంప్ సర్కారు మాత్రం భౌతికంగా తరగతులకు హాజరయ్యేవారికి మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం కల్పిస్తామని, ఆన్‌లైన్ అందించే విద్యాసంస్థల విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాలని, లేదంటే తాము తీసుకునే చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఇమ్మి్గ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) ప్రకటించింది. ఈ నిర్ణయం పాశవికమని, కరోనా కాలంలోనూ భౌతికంగా హాజరవ్వాలని ఆదేశించటం సరికాదని జేహెచ్‌యూ ఆగ్రహించింది.

ముందస్తు సమచారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు సబబు కాదని, ఈ నిర్ణయం అమెరికా విధానాలకు, చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. ఈ నిర్ణయంతో యూనివర్సిటీ గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని, యూఎస్ ప్రకటనపై స్టే ఇవ్వాలని కోర్టును కోరింది. సర్కారు నిర్ణయంతో తమ వర్సిటీకి చెందిన సుమారు ఐదువేల మంది విదేశీ విద్యార్థులు, ఇతర వర్సిటీల్లోనూ వేలాది మంది విద్యార్థులు ప్రభావితం కానున్నారని వివరించింది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed