మహిళా వ్యాపారవేత్తల కోసం 'కోవే' వర్చువల్ ఎగ్జిబిషన్!

by Harish |
మహిళా వ్యాపారవేత్తల కోసం కోవే వర్చువల్ ఎగ్జిబిషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా దెబ్బతిన్న మహిళా వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా వర్చువల్ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గురువారం ప్రారంభించారు. ఆల్ ఇండియా వర్చువల్ కోవే మార్ట్ పేరుతో ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్ ద్వారా 50 మంది విక్రేతలు తమ ఉత్పత్తులైన టెక్స్‌టైల్స్, కాస్మోటిక్స్, జ్యువెలరీ, సేంద్రీయ ఆహార ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. చిన్న మహిళా పారిశ్రామికవేత్తలకు, ఇంటి నుంచి పనిచేసే మహిళా వ్యాపారవేత్తలకు మార్కెటింగ్‌లో చేయూత ఇచ్చేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడిందని ‘కోవే’ నిర్వాహకులు తెలిపారు. చిన్న, సూక్ష్మ వ్యాపారాల పునరుద్ధరణకు డిజిటలైజేషన్, కొత్త అవకాశాలను అన్వేశించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఈ ఎగ్జిబిషన్ 70 రోజుల వరకు కొనసాగుతుందని, నవంబర్ 5 నుంచి జనవరి 15 వరకు ఉండనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కరోనా మహమ్మారిని అధిగమించి సంస్థలు పటిష్టమైన డిజిటలైజేషన్‌ను పారిశ్రామికవేత్తలకు అందించాలని జయేష్ రంజన్ ‘కోవే’ నిర్వాహకులకు సూచించారు. సరళమైన డిజిటలైజేషన్ విధానాలను పరిచయం చేయాలని, వీలైనంత వేగంగా వాటిని అమలుపరచాలని తద్వారా పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య సహకారానికి వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ‘కోవే’ జాతీయ అధ్యక్షురాలు సౌదామిని ప్రొద్దుటూరి మాట్లాడుతూ.. ‘కోవే’ సంస్థ హైదరాబాద్‌లో స్థాపించబడి, జాతీయ స్థాయిలో ఉనికిని కలిగిన మొదటి మహిళా సంఘం అన్నారు. భవిష్యత్తులో 4 జోన్‌లలో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం ‘కోవే’లో సుమారు 800 మంది మహిళా వ్యాపారవేత్తలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థలో 10 శాఖలు, వెయ్యికిపైగా ఇతర సభ్యులున్నారు.

Advertisement

Next Story