- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోదారమ్మ నీకది తగునా.. వారి ఘోషను పట్టించుకొనేదెవరు..?
దిశ, పలిమెల: గోదావరి తీర రైతులు నీరు అందుబాటులో ఉందని సంతోషపడాలో, నిత్యం పంటలు ఆ నీట మునిగిపోతున్నాయని ఆందోళన చెందాలో అంతుచిక్కని పరిస్థితితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. శతాబ్దాలుగా అనుబంధం పెనవేసుకున్న గోదారమ్మే తమ పంటలను నిండా ముంచేస్తుండంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి తీరంలోని లెంకలగడ్డ, పంకెన, పలిమేల, సర్వాయి పేట గ్రామాల భూములు ఏటా గోదావరి ఉగ్రరూపం దాల్చినప్పుడల్లా పంట నీట మునిగిపోతున్నాయి. ఈ గ్రామాల్లో పండించే పత్తి, మిర్చి, వరి పంటలు గోదావరి పాలయిపోతున్నాయి. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ ఏడాది ఏకంగా మూడు సార్లు పంటలను ముంచేసింది గోదావరి వరద.
మేడిగడ్డ బ్యారేజ్ నీటిని వదిలినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకుంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజ్ గేట్లు ఎత్తగానే కట్టలు తెంచుకున్న నీటి ప్రవాహపు ఉధృతి కారణంగా పంట చేలల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు అంటున్నారు. అలాగే వరద నీటి ప్రవాహం తీవ్రంగా వస్తుండడంతో పంట భూములు కూడా కోతకు గురవుతున్నాయని, ఏటేటా తమ భూముల విస్తీర్ణం అంతా గోదావరి పాలవుతోందని వివరించారు.
అంచనాల్లో విఫలం..
మేడిగడ్డ నుండి నీటిని వదిలినప్పుడు వరద ఎంతమేర వస్తుంది, దీనివల్ల ఎన్ని ఎకరాలు మునిగిపోయే ప్రమాదం ఉంది అన్న అంచనాలు వేయడంలో అధికారులు విఫలం అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతికంగా వీటిని అంచనా వేసి భూ సేకరణ జరిపి దిగువ భాగాన ఉన్న రైతాంగానికి పరిహారం అందిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు స్థానికులు. అయితే గత రెండు మూడేళ్లుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా తరుచూ బ్యారేజ్ గేట్లు ఎత్తుతుండడంతో పంట భూములన్ని నీటమునుగుతున్నాయి. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టకపోవడం వల్లే తాము పరిహారం పొందక, వేసిన పంటలు మునకకు గురై తీవ్రంగా నష్టపోతున్నామని పలిమెల మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి మేడిగడ్డ బ్యారేజ్ దిగువ ప్రాంతంలో ఏటా మునకకు గురవుతున్న భూముల గురించి సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే గత మూడేళ్లుగా నీట మునిగిన పంటలకు పరిహారం కూడా ఇప్పించాలని కోరుతున్నారు.