ఆర్టికల్ 370 రద్దుకు పోరాడిన యోధుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ

by Shyam |
ఆర్టికల్ 370 రద్దుకు పోరాడిన యోధుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ
X

దిశ, కరీంనగర్ :
జమ్మూ కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు(ఆర్టికల్-370) కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఘనత జన సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్‌ ముఖర్జీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, దేశ సమగ్రత నినాదంతో ఆర్టికల్‌ 370కి వ్యతిరేకంగా బలమైన గళం వినిపించిన వ్యక్తి శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ మాత్రమేనని గుర్తుచేశారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన వర్ధంతి సందర్భంగా బలిదాన్‌ దివస్‌ నిర్వహించారు. ఎంపీ కార్యాలయంలో ముఖర్జీకి నివాళులు అర్పించిన సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ..దేశం కోసం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. అఖండ భారత్ కోసం పరితపించి, ప్రాణత్యాగం చేసిన వీరున్ని స్మరించుకుని, స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే దేశభక్తి అలవర్చుకున్న ముఖర్జీ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్‌ను పాకిస్థాన్‌లో కలిపేందుకు బ్రిటిష్‌ వాళ్లు, కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తే శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ వ్యతిరేకించారని వివరించారు.

నేడు బెంగాల్‌ భారత్‌లో ఉందంటే అది ఆయన వల్లేనని విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ అనుసరించిన మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలను ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని సంజయ్ తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటే లక్ష్యంగా జనసంఘ్‌ స్థాపించారన్నారని స్పష్టంచేశారు. ఏక్‌ దేశ్‌ మే..దో నిషాన్‌, దో ప్రధాన్, దో విధాన్‌ నహీ చలేగా అంటూ నినదిస్తూ పోరాడిన శ్యామ ప్రసాద్‌ బాటలో నడుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంలో సఫలం అయ్యారన్నారు.కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, బీజేపీ కార్పోరేటర్లు కొలగాని శ్రీనివాస్‌, మర్రి భావన‌, కాసర్ల ఆనంద్‌, రాపర్తి విజయ, కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్‌, నాయకులు మెండి చంద్రశేఖర్‌, బండ రమణారెడ్డి, కాశెట్టి శేఖర్‌, పుల్లెల పవన్‌ కుమార్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed