జమ్ముకశ్మీర్ రాజ్యాంగ సభ చివరి సభ్యుడు మృతి

by Sumithra |
జమ్ముకశ్మీర్ రాజ్యాంగ సభ చివరి సభ్యుడు మృతి
X

న్యూఢిల్లీ : పూర్వపు జమ్ముకశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ సభలో మిగిలి ఉన్న చివరి సభ్యుడు, కామ్రేడ్ కృష్ణన్ దేవి సేథి(93) గురువారం ఉదయం కన్నుమూశారు. 1928, జనవరి 1న మీర్‌పూర్‌లో జన్మించిన ఆయన డెమొక్రటిక్ కాన్ఫ‌రెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగ సభ‌కు 1951-57 వరకు సభ్యుడిగా పనిచేశారు.షేక్ అబ్దుల్లా‌ను రాష్ట్ర ప్రధాన మంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించారు. భూ గరిష్ఠ పరిమితి విధించడం, రుణగ్రహీతల అప్పులను రద్దు చేయడం తదితర భూ సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేశారు. 1957లో నౌషెరా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి డెమొక్రటిక్ నేషనల్ కాన్ఫ‌రెన్స్(డీఎన్‌సీ) తరఫున ఎన్నికయ్యారు.

1961లో కాంగ్రెస్ పార్టీలో చేరినా డీఎన్‌సీతోనే రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. 1962లో నౌషారా నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బెలి రామ్ చేతిలో ఓటమిపాలయ్యారు. మొదట సేథినే గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. కానీ, 15 నిమిషాల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బెలి రామ్ విజయం సాధించినట్లు ధ్రువీకరించారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికల ఫలితాలను మార్చినట్లు సేథి ఆరోపించారు. ఆ తర్వాత దేశంలో నక్స‌లైట్ ఉద్యమంతో ప్రభావితమైన కమ్యూనిస్టు నేత పియారా సరఫ్‌తో కలసి ఆయన డెమొక్రటిక్ కాన్ఫ‌రెన్స్‌ను స్థాపించారు. ఈ పార్టీ సీపీఐ(ఎంఎల్)‌కు అనుబంధ సంస్థగా కొనసాగింది. సరఫ్‌తో కలసి సేథి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed