రియల్ లైఫ్ స్టోరీ ‘జై భీమ్’ .. అసలు కథ ఇదే

by Shyam |
రియల్ లైఫ్ స్టోరీ ‘జై భీమ్’ .. అసలు కథ ఇదే
X

దిశ, ఫీచర్స్ : పోలీస్, న్యాయ వ్యవస్థలోని లొసుగుల్ని ప్రశ్నిస్తూనే సమాజంలో వెనకబడిన వర్గాల జీవన చిత్రాన్ని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘జై భీమ్’. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్’ ప్రైమ్‌ వేదికగా ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిచేత ‘జై’కొట్టించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు చంద్రు అనే న్యాయవాది పాత్రలో అద్భుతంగా నటించాడు. 1993లో కడలూరు జిల్లాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందించగా, చంద్రు అనే న్యాయవాది కూడా నిజజీవిత పాత్రే. లాయర్ నుంచి హైకోర్టు జడ్జిగా ఎదిగినా, జనం మనిషిగా, జనం సాక్షిగా ఇప్పటికీ జనమే తానై జీవిస్తున్న వ్యక్తి ‘చంద్రు’. ఎన్నో హక్కుల ఉద్యమాలను ముందుండి నడిపిన ఆ లాయర్.. పేదల పక్షాన, అణగారిన వర్గాల తరపున వేలాది కేసులు వాదించాడు. ‘జై భీమ్’ చిత్రానికి ఇతివృత్తంగా మారిన చంద్రు పోరాటం కూడా అలాంటిదే. ఈ చిత్రంలోని లాయర్ చంద్రుతో పాటు అతడి రియల్ లైఫ్ విశేషాలేంటో తెలుసుకుందాం.

టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’ రీల్ స్టోరీ కాగా, అసలు యథార్థ సంఘటన విషయానికొస్తే.. ‘అండై కురుంబర్’ తెగకు చెందిన రాజకన్ను వ్యవసాయ కూలీ. అతడికి ఉపాధి కల్పించిన ఇంట్లోనే నగలు దొంగిలించారనే ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోగా, కస్టడీలో చిత్రహింసలకు గురై చనిపోతాడు. దీంతో పోలీసులు అతని మృతదేహాన్ని రాత్రికే రాత్రే తరలించి, పొరుగున ఉన్న తిరుచిరాపల్లి (తిరుచ్చి)లో పడేసి కస్టడీ నుంచి తప్పించుకున్నాడని పేర్కొంటారు. అయితే రాజకన్ను భార్య పార్వతి తన భర్త జాడ కనిపెట్టేందుకు మద్రాసు హైకోర్టు న్యాయవాది కె చంద్రును కలవగా.. ఆమెతో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేయిస్తాడు.

ఈ క్రమంలో కేసు విత్ డ్రా చేసుకునేందుకు పార్వతికి, చంద్రుకు పోలీసులు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినా వాళ్లు అందుకు ఒప్పుకోరు. మొత్తానికి 13 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత ఇది కస్టడీ మరణమేనని తీర్పునిచ్చిన కోర్టు, రాజకన్ను హత్య కేసులో నిందితులైన పోలీసు అధికారులకు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అట్టడుగు, అణగారిన వర్గాల కోసం జస్టిస్ చంద్రు చేసిన అనేక సహకారాల్లో ఇది ఒకటి మాత్రమే.

స్థూడెంట్ లీడర్ టు లాయర్..
సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చంద్రు కళాశాల జీవితం.. అతడి వ్యక్తిగత నేపథ్యానికి పూర్తిగా విరుద్ధం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) విద్యార్థి నాయకుడిగా తరచూ విద్యార్థులు, కార్మికుల హక్కుల కోసం పోరాడేవాడు. కార్యకర్తగా, ట్రేడ్ యూనియన్‌వాదిగా ఫ్యాక్టరీలను సందర్శించి, కార్మికులతో సమావేశాలు నిర్వహించేవాడు. లారీలు, బస్సుల్లో తమిళనాడు అంతటా పర్యటించి దళిత కూలీల కుటుంబాలు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యేవాడు. ఇలా అణగారిన, అట్టడుగు వ్యవస్థకు జరుగుతున్న అన్యాయాలను ప్రత్యక్షంగా చూసి న్యాయబద్ధంగా పోరాటాలు చేశాడు. ఈ క్రమంలోనే 1973లో లా కాలేజీలో చేరిన చంద్రు.. ఆ తర్వాత పేదల కోసం న్యాయ ప్రాతినిథ్యాన్ని అందించే ‘రో & రెడ్డి’ న్యాయ సంస్థలో ఎనిమిదేళ్లు పనిచేశాడు. ఆ తర్వాత ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగి జూలై 2006లో మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.

జస్టిస్ ఫర్ పీపుల్..
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఆరున్నరేళ్లలో 96,000 కేసులు పరిష్కరించాడు. ఇది చంద్రు నిబద్ధతకు నిదర్శనం కాగా.. ఏ ఒక్కరికీ అన్యాయం కలగవద్దనే అంకితభావంతోనే ఇదంతా సాధ్యమైంది. రోజుకు సగటున 75 కేసులు పరిష్కరించాడంటే ఆయన సేవలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రయాణంలో సమాజం హర్షించే, చరిత్రలో నిలిచిపోయే ఎన్నో తీర్పులు అందించాడు. ‘ఆలయానికి అధిష్టానం దేవత అయినప్పుడు, అటువంటి ఆలయాల్లో పూజలు చేసేందుకు ఒక మహిళపై అభ్యంతరాలు లేవనెత్తడం విడ్డూరం.. ఈ ఆలయంలో మహిళలు పూజలు చేయడాన్ని ఏ చట్టం లేదా పథకం నిషేధించలేదు’ అంటూ ఓ కేసులో తీర్పునిచ్చాడు.

దేవాలయాల్లో మహిళలు కూడా పూజారులుగా సేవలందించడానికి ఆ తీర్పే బాటలు వేసింది. అంగన్‌వాడీ వర్కర్‌ ఎ. తమిళరసి కేసులో భాగంగా ‘డిజెబిలిటీస్ యాక్ట్ -1995’ సెక్షన్ 47 ప్రకారం ‘సర్వీస్ పీరియడ్‌లో వైకల్యం పొందిన ఉద్యోగిని ఏ సంస్థలు తొలగించకూడదు లేదా ర్యాంక్‌ను తగ్గించకూడదు. మానసిక ఆరోగ్య సమస్య కూడా వైకల్యమేనని, ఈ సమస్యతో బాధపడేవారు సైతం ప్రభుత్వ సర్వీస్‌లో కొనసాగేందుకు అర్హులేనంటూ సంచలన తీర్పు వెలువరించాడు. కులమతాలకు అతీతంగా ఉమ్మడి శ్మశానవాటిక, మధ్యాహ్న భోజన కేంద్రాల్లో కమ్యూనిటీ ఆధారిత రిజర్వేషన్లు వంటి తీర్మానాలు తీసుకొచ్చిన ఆయన తీర్పులు.. చరిత్ర గతిని మార్చడంతో పాటు సామాజిక ప్రభావాన్ని చూపాయి.

నిరాడంబరుడు..
జస్టిస్ చంద్రు.. మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా 2013లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి పౌర సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చట్టాలపై అనేక కాలమ్స్, పుస్తకాలు రాశాడు. ‘లిసన్ టు మై కేస్ : వెన్ ఉమెన్ అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ తమిళనాడు’ పుస్తకంలో 20 మంది మహిళల కథల్ని ఆవిష్కరించగా, న్యాయం కోసం వారి పోరాటాన్ని అందులో వివరించాడు. తన వ్యక్తిగత రోజువారీ చర్యల్లో కూడా సమానత్వాన్ని ఆచరించే చంద్రు.. కోర్టులో తనను ‘మై లార్డ్’ అని సంబోధించవద్దని న్యాయవాదులను కోరేవారు.

వ్యక్తిగత భద్రతా అధికారి (PSO)ని కూడా తిరస్కరించాడు. తన రిటైర్‌మెంట్ రోజున తన వ్యక్తిగత ఆస్తులను ప్రకటించి గొప్ప మానవతామూర్తిగా నిలిచాడు. పదవీ విరమణ తర్వాత అధికారిక వాహనాన్ని అప్పగించి, లోకల్ రైలులో ఇంటికి బయలుదేరి తన నిరాడంబరతను చాటుకున్నాడు. అణగారిన వర్గాల కోసం పోరాడటానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిగా ‘జస్టిస్ చంద్రు’ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాడు.

స్ఫూర్తి రగిల్చిన నాగమ్మళ్..
దక్షిణ ఆర్కాట్ జిల్లాకు చెందిన నాగమ్మళ్ అనే మహిళ నాపై ఎంతో ప్రభావం చూపింది. ఆమె కుటుంబాన్ని కొందరు స్థానిక పెద్దలు చిత్రహింసలకు గురిచేశారు. పోలీసులతోనూ ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఈ ఘటనపై ఆమె అధికారులందరికీ ఫిర్యాదులు పంపింది. నిరక్షరాసురాలైన ఓ మహిళ ఎవరి మద్దతు లేకుండా అత్యున్నత అధికారులకు పిటిషన్ దాఖలు చేయడం అద్భుతంగా అనిపించింది. పర్సులో ఒక్క పైసా లేని కాలంలో ఆమె ఢిల్లీ వరకు ప్రయాణించి, అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ను కలిసిందంటే ఎంతటి ధీశాలో అర్థం చేసుకోవచ్చు. ఇలా చాలా రోజులు వరకు ఆహారం కూడా తీసుకోకుండా ఆమె న్యాయం కోసం పోరాడింది. ఈ క్రమంలో రిటైర్డ్ జస్టిస్ ఎం అనంత నారాయణన్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ యాక్సెస్ ఎంక్వైరింగ్ అథారిటీ ముందుకు ఆమె కేసు విచారణకు వచ్చింది.

కమిషన్ కొంత నగదు పరిహారంతో పాటు పోలీసులపై చర్యలకు సిఫారసు చేసినప్పటికీ, హైకోర్టు పోలీసులపై చర్యలను రద్దు చేసింది. పెద్దలు, అధికారులకు వ్యతిరేకంగా నాగమ్మల్ పోరాడిందంటే ఇప్పటికీ నమ్మశక్యం కాదు. నేటికీ, నాగమ్మళ్ వంటి వ్యక్తులు నాలో ఉత్తేజాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా వ్యవస్థపై పోరాడాలనే ఆమె సంకల్పమే మనకు కావాల్సింది. అయితే ఎంతోమంది సామాన్య మహిళలు ఇప్పటికీ కోర్టుకు రావాలంటే వెనకంజ వేస్తున్నారు. అందుకే నేను కోర్టు తలుపులు తట్టే సాధారణ స్త్రీల కేసులు వాదించాను. వారికి న్యాయం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాను. ఆ మహిళా కథలతోనే ‘లిసన్ టు మై కేస్’ బుక్ రాశాను.
– చంద్రు, రిటైర్డ్ జడ్జి

Advertisement

Next Story

Most Viewed