- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పులపైనే రాష్ట్రం ఆధారపడుతోందా..?
ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టే అప్పులు పుడుతున్నాయి. అప్పులు ఇచ్చేవారు కూడా తిరిగి చెల్లించే స్థోమత ఉందో లేదో చూసే ఇస్తారు. తెలంగాణ ధనిక రాష్ట్రం, వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రం. అందుకే అప్పులు ఇవ్వడానికి క్యూ కడుతున్నారు” ఇదీ టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు పదేపదే చెప్పేమాట. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అప్పులపైనే రాష్ట్రం ఆధారపడుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రానికి ఏటేటా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. బడ్జెట్‌లో దాదాపు 20% వరకు పాత అప్పులను చెల్లించడానికో లేదా వడ్డీలు కట్టడానికో సరిపోతోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా రిజర్వు బ్యాంకు ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చినాటికి రాష్ట్రం తిరిగి చెల్లించాల్సిన అప్పు రూ.1.68 లక్షల కోట్లు. ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాల్లో తీసుకున్న రూ.14,500 కోట్లు, రానున్న రెండు నెలల్లో తీసుకోనున్న మరో రూ.8,000 కోట్లను కలుపుకుంటే ఇది సుమారు రూ.1.91 లక్షల కోట్లకు చేరుతుంది. ఇవి స్టేట్ డెవలప్‌మెంట్, నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, నాబార్డు, ఎల్ఐసీ, జీఐసీ, వివిధ బ్యాంకుల తీసుకున్న అప్పులే. మిషన్ భగీరథ కోసం, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం, విద్యుత్ సంస్థలు తీసుకున్నవి కూడా కలుపుకుంటే అప్పుల భారం మరింత ఎక్కువే అవుతుంది.
తలకు మించిన భారమే
రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా సుమారు 37 వేల కోట్లను గతంలో తీసుకున్న అప్పులు, వడ్డీలను చెల్లించడానికే ఖర్చుచేయాల్సి ఉంటుంది. రాష్ట్రానికి ఆదాయం వచ్చినా రాకున్నా వీటిని చెల్లించకుండా జనరల్ అకౌంట్‌లోంచి ఆటోమేటిక్‌గా కట్ అయిపోతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు సమానంగా అప్పుల చెల్లింపులకు పోతున్నాయని అన్నారు. ఈ అప్పులతో కలిపి జీఎస్‌డీపీ పెరిగినట్లుగా కనిపిస్తున్నా, వీటిని తిరిగి చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్‌డీపీలో 25 శాతం మించడం లేదంటూ ప్రభుత్వం ఒకింత గర్వంగా చెబుతోంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కరోనా కారణంగా రెండు నెలలుగా లాక్‌డౌన్‌తో ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో అప్పు చేయక తప్పలేదు. ఒక్క నెల అప్పు తీసుకోకుండా నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. తొమ్మిది నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం రూ. 15,051 కోట్ల అప్పుకు అనుమతి ఇస్తే, మూడు నెలల్లోనే రూ.12,500 కోట్లను తీసుకునే పరిస్థితి ఏర్పడింది.
ఏటేటా పెరుగుతూ
రాష్ట్ర జీఎస్‌డీపీలో 2017-18 నాటికి 20.21% గా ఉన్న రుణ భారం 2020-21 నాటికి 20.74%కి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఎఫ్ఆర్‌బీఎం రుణ పరిమితి పెంచడంతో జీఎస్‌డీపీలో 5% తీసుకోడానికి సిద్ధపడింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మొత్తం అప్పు జీఎస్‌డీపీలో పాతిక శాతానికి పెరిగినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. రెండు నెలల పాటు స్వీయ ఆర్థిక వనరులు దెబ్బతినడంతో పాత అప్పులను చెల్లించడానికి మళ్లీ కొత్త అప్పులు చేయక తప్పలేదు. మూడేళ్ల క్రితం (2018-19) రిజర్వు బ్యాంకు నుంచి స్టేట్ డెవలప్‌మెంట్ పేరుతో తీసుకున్న అప్పుల్లో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకుంది. గుజరాత్, కర్నాటక రాష్ట్రాలను వెనక్కి నెట్టి, వాటికంటే ఎక్కువ మొత్తంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలను తీసుకుంది. తీసుకున్న అప్పులను తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వస్తున్నందున వడ్డీ ఎక్కువైనా ఫర్వాలేదనుకుంటోంది. 25 ఏండ్ల తర్వాత తీర్చేలా ఒప్పందం కుదుర్చుకుంటోంది. ‘‘అప్పులను కూడా కలుపుకుని మిగులు బడ్జెట్‌గా, ధనిక రాష్ట్రంగా, దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ప్రభుత్వం చెప్పుకోవచ్చుగానీ, రెండు నెలలకే జీతాలను సగానికి కుదించి, అప్పులను మూడు రెట్లు ఎక్కువగా తీసుకుని సర్దుబాటు చేయాల్సి రావడం వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతోంది’’ అని ఒక అదికారి వ్యాఖ్యానించారు.
వడ్డీకే సరి
2018-19లో రూ. 26,740 కోట్ల స్థూల అప్పును తీసుకుంటే, అందులో రూ. 4,557 కోట్లను పాత అప్పులు, వాటిమీద వడ్డీలకే చెల్లించాల్సి వచ్చింది. నికరంగా తీసుకున్నది రూ.22,183 కోట్లు మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరం (2019-20)లో స్థూలంగా రూ.37,109 కోట్ల అప్పును తీసుకుంటే అందులో పాత అప్పులకురూ. 6,412 కోట్లను చెల్లించి (రీపేమెంట్) నికరంగా రూ. 30,697 కోట్లను మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో రూ. 8,000 కోట్ల స్థూల రుణంలో రూ. 1,667 కోట్లను పాత అప్పులకు, వాటిమీద వడ్డీకే చెల్లించాల్సి వచ్చింది.
రుణాల పరిస్థతి ఇదీ
2017-18 నాటికి రూ. 1.52 లక్షల కోట్లు
2018-19 నాటికి రూ. 1.75 లక్షల కోట్లు
2019-20 నాటికి రూ. 1.99 లక్షల కోట్లు
2020-21 నాటికి రూ. 2.29 లక్షల కోట్లు
వీటికి హడ్కో, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ తదితరాల నుంచి తీసుకున్న అప్పులు అదనం.