- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణ
దిశ, న్యూస్‌బ్యూరో: వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారుతున్న తెలంగాణలో సాగునీటి రంగానికి ప్రాధాన్యతతో పాటు బాధ్యత కూడా పెరిగిందని, దీనికి అనుగుణంగా నీటిపారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్ వ్యవస్థీకరణ జరగాల్సిన అవసరం ఏర్పడిందని, వేర్వేరు విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి వస్తాయని, నీటిపారుదల శాఖ ఇక నుంచి జలవనరుల శాఖగా మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎంత మంది ఇంజనీర్-ఇన్-ఛీఫ్ (ఈఎన్సీ)లు అవసరమో నిర్ధారించాలని, జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్ విభాగాలకు విడివిడిగా ఈఎన్సీలు మాత్రం తప్పకుండా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో ఒకటింపావు కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ప్రతీరోజు గోదావరి నది నుంచి నాలుగు టీఎంసీలు, కృష్ణా నది నుంచి మూడు టీఎంసీల చొప్పున లిఫ్టు చేయాలన్నారు. అవసరమైతే వెయ్యి కొత్త పోస్టుల్ని మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పంపు హౌజ్‌ల నిర్వహణను విద్యుత్ శాఖకు అప్పగించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జలవనరుల శాఖకు అనుసంధానం చేయడంపైనా, ఏయే పనులు ఈ ప్రకారం చేయవచ్చో నిర్ధారించి దానికి అనుగుణంగా ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
సాగునీటిరంగంపై ఆ శాఖ అధికారులు, మంత్రులతో ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన సుదీర్ఘ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో పై అంశాలను పేర్కొన్నారు. తెలంగాణలో మారిన సాగునీటి రంగం పరిస్థితికి తగ్గట్టుగా జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై అధికారులు రూపొందించిన ముసాయిదాను సీఎం చర్చించి కొన్ని మార్పులు సూచించారు. అధికారులు మరోసారి వర్క్‌షాపు నిర్వహించుకుని ఈ మార్పులకు అనుగుణంగా పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఖర్చుకు వెనకాడకుండా భారీ ప్రాజెక్టులు నిర్మించినందున వీటి ద్వారా 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేలా జల వనరుల శాఖ సంసిద్ధం కావాలన్నారు. జలవనరుల శాఖ కిందికే అన్ని విభాగాలూ వస్తాయని, ఇకపైన వేర్వేరు విభాగాలు ఉండవన్నారు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించి ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్ (సీఈ)ని ఇంఛార్జిగా నియమించాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్ల పరిధిని కూడా ఖరారు చేయాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, చెరువులు, లిఫ్టులు, చెక్ డ్యాములు సాగునీటికి సంబంధించిన సర్వస్వం సంబంధిత ప్రాదేశిక ప్రాంతానికి చెందిన సీఈ పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. సీఈ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో ఖచ్చితమైన లెక్కలు తీయాలని, ప్రాజెక్టుల ద్వారా మొదట ఈ చెరువులను నింపడమే ప్రాధాన్యతగా ఉండాలని, దానికి సంబంధించిన ప్రణాళికలను సంబంధిత సీఈ సిద్ధం చేయాలన్నారు.
పునర్ వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఈఎన్సీ స్థాయి నుంచి లష్కర్ వరకు ఎంతమంది సిబ్బంది అవసరం? ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు తదితర విషయాల్లో వాస్తవిక అంచనాలు వేసి ఖచ్చితమైన నిర్ధారణకు రావాలని, అవసరాన్నిబట్టి వెయ్యి కొత్త పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు కచ్చితంగా ఆపరేషన్ మాన్యువళ్ళను రూపొందించాలని, ఆ ప్రకారమే నిర్వహణ జరగాలన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలన్నారు. ప్రాజెక్టుల రిజర్వాయర్ల దగ్గరే సీఈల క్యాంపు కార్యాలయాలు, గెస్ట్ హౌజ్‌లు నిర్మించాలన్నారు.