‘ఇండియాలోనే ఐపీఎల్ జరుగుతుందని చెప్పలేం’

by Shyam |
Arun Dhumal
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ ఇండియాలోనే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేమని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వ్యాఖ్యానించారు. ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన అనంతరమే ఐపీఎల్ వేదికలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన మంగళవారం ఒక క్రీడా వెబ్‌సైట్‌తో చెప్పారు. గత కొన్ని రోజులుగా ఇండియాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ రాబోతున్నట్లు ఆరోగ్య సంస్థలు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ సారి కూడా ఐపీఎల్ వేదికను యూఏఈకి తరలించే అవకాశాలు ఉన్నాయి. ‘ఐపీఎల్ వేదికలు ఎక్కడ, షెడ్యూల్ ఏమిటనే దానిపై బీసీసీఐ వద్ద ఇప్పటికీ సమాధానాలు లేవు. అయితే ఇంగ్లాండ్-ఇండియా సిరీస్ తర్వాత తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం’ అని అరుణ్ దుమాల్ వెల్లడించారు. ఐసీసీ తమ క్యాలెండర్‌లో ఏప్రిల్, మే నెలలను ఐపీఎల్ కోసం అనధికారికంగా కేటాయించింది. దీంతో ఈ రెండు నెలల్లోనే తప్పకుండా ఐపీఎల్ నిర్వహించాల్సి ఉన్నది. దీనిపై బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై స్పష్టత రావల్సి ఉన్నది.

Advertisement

Next Story