- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆదిలాబాద్‌లో అసమ్మతి రాగాలు.. కారు పార్టీలో మొదలైన కంగారు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కారు పార్టీలో కంగారు మొదలైంది.. గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయి.. అధికార పార్టీలో అసమ్మతి రాజుకుంది.. స్థానిక ఎమ్మెల్సీ వేదికగా.. అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి.. సొంత జడ్పీటీసీ సభ్యులే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వేయటంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.. పత్తిరెడ్డి, పురపాటి నామినేషన్లు వేయగా.. వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అనటంతో అధికార పార్టీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే మిగిలి ఉండటంతో.. ఇప్పటికే మంత్రి అల్లోల, విప్ సుమన్ రంగంలోకి దిగారు.. అభ్యర్థులను బుజ్జగించే పనిలో ఉన్నారు..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అధికార పార్టీ జడ్పీటీసీ సభ్యులే నామినేషన్లు వేయటంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నామినేషన్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేయగా.. మొత్తం 24మందిలో నుంచి ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. మరో 18మంది బరిలో ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు నేడు ఒక్కరోజు గడువు మిగిలి ఉంది. అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ.. ఎన్నిక అనివార్యమయ్యేలా ఉంది. శుక్రవారం రోజున నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజుకాగా.. ఎందరు బరిలో ఉంటారనేది తేలిపోనుంది. జిల్లాలో 24మంది నామినేషన్లు వేయగా.. టీఆర్ఎస్ నుంచి దండె విఠ్ఠల్ ఒక్కరే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి ఉన్నారు. మిగతా 23మంది అభ్యర్థులు స్వతంత్రులుకాగా.. కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరంగా ఉన్నాయి.
అధికార పార్టీకి చెందిన ఇద్దరు జడ్పీటీసీ సభ్యులే బరిలో ఉండటంతో.. కారు పార్టీలో కంగారు మొదలైంది. సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కడెం జడ్పీటీసీ సభ్యుడు పురపాటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు వేశారు. అధికార పార్టీ జడ్పీటీసీ సభ్యులే నామినేషన్లు వేయటంతో.. గులాబీ పార్టీకి పంటిలో ముల్లులా తయారయ్యారు. నేడు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజుకాగా.. వీరు బరిలో ఉంటారా.. లేదా.. అనేది తేలనుంది. సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్ వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అనటంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. పార్టీ ఓటర్లకు ఎంపీటీసీ సభ్యులకు రూ.5లక్షలు, జడ్పీటీసీ సభ్యులకు రూ.10లక్షల వరకు ఇవ్వాలనే డిమాండ్ చేసినట్లు తెలిసింది. మంత్రి అల్లోలతో విబేధాల వల్లనే ఆయన నామినేషన్ వేశారనే చర్చ సాగుతోంది. స్థానిక ఓటర్లకు నిధులు, విధులు, ప్రాధాన్యత లేకపోగా.. వీరంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.
అధికార పార్టీకి చెందిన ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు ఉండటంతో.. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సీరియస్‌గానే తీసుకుంటోంది. అసలు వీరి వెనక ఎవరున్నారనే విషయంపై ఇప్పటికే ఇంటలీజెన్స్ ఆరా తీసినట్లు తెలిసింది. అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులే వెనకుండి కథ నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ నివేదిక పార్టీ నాయకత్వానికి చేరినట్లు తెలిసింది. దీంతో సీరియస్‌గా తీసుకున్న పార్టీ నాయకత్వం.. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి తమ పరిధిలోని అభ్యర్థులను తప్పించేలా బాధ్యత తీసుకోవాలని హెచ్చరికలు వచ్చాయి. ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రంగంలోకి దిగారు. నిర్మల్ కేంద్రంగా బుజ్జగింపుల పర్వం జోరుగా సాగుతోంది. బాల్క సుమన్ కూడా గురువారం నిర్మల్‌లోనే ఉన్నారు. ఎమ్మెల్యేలతో మాట్లాడి సమన్వయం చేస్తున్నారు. పత్తిరెడ్డి నామినేషన్ వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటుండగా.. ఆయన అందుబాటులోకి కూడా రావటం లేదని తెలిసింది. ఇక పురపాటి శ్రీనివాస్ రెడ్డి నేడు నామినేషను వెనక్కి తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ సభ్యులను చేజారకుండా చేసేందుకు నేడు క్యాంపునకు తరిలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.