ఇంటెలిజెంట్ పెళ్లి కూతురు.. వివాహానికి ముందే కనిపెట్టేసింది..!

by Sumithra |   ( Updated:2021-06-23 06:06:53.0  )
Groom with Black Spades
X

దిశ, వెబ్‌డెస్క్ : వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలి అంటారు పెద్దలు. సరిగ్గా అలాగే ఓ అబద్దం ఆడి పెళ్లి చేయాలనుకున్నారు వరుడి కుటుంబీకులు. ఎంతో గ్రాండ్‌గా వివాహ వేడుకలు జరుగుతున్నా.. పెళ్లి కూతురులో వరుడిపై చిన్న అనుమానం ఉంది. తీరా పెళ్లిపీటలు ఎక్కాక అతడి బండారాన్ని బయటపెట్టి వివాహాన్ని ఆపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

జమాలిపూర్ గ్రామానికి చెందిన యువతికి మహారాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన వినోద్‌ కుమార్‌తో వివాహం నిశ్చయం చేశారు. అయితే పెళ్లి చూపుల కార్యక్రమం నుంచి పెళ్లితంతు జరిగే వరకు పెళ్లి కొడుకు నల్లకళ్లద్దాలు ధరించి ఉండడం యువతి గుర్తించింది. మొదట స్టైల్‌ కోసం పెట్టుకొని ఉండొచ్చు అనుకున్న పెళ్లికూతురుకు.. ఆ తర్వాత అనుమానం కలిగింది. అసలు అతడికి కళ్లు కనిపిస్తాయా.. లేదా అనే సందేహం వచ్చింది. కానీ ప్రశ్నించలేకపోయింది.

ఈలోపు ముహూర్త సమయం ముంచుకురావడంతో పెళ్లి తంతు ప్రారంభమైంది. ఓవైపు బంధుమిత్రుల కోలాహలంతో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరోవైపు మండపంలో వరుడు నల్లకళ్లజోడుతో పెళ్లిపీటలపై కూర్చున్నాడు. అది చూసిన వధువుకు అనుమానం బలపడింది. వెంటనే వరుడి దగ్గరికి వెళ్లి కళ్లజోడు తీసింది. ఓ పేపర్ ఇచ్చి చదవమని కోరింది. కానీ వరుడు చదవలేకపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన వధువు తనను మోసం చేసి పెళ్లి చేయాలని అనుకున్నారా.. అని పెళ్లి కుమారుడి కుటుంబీకులపై ఫైర్ అయింది. తనకు ఈ పెళ్లి వద్దని వెళ్లిపోయింది. దీనిపై ఇరు కుటుంబాల మధ్య రెండు రోజులు వివాదం జరిగింది. చివరికి పెళ్లి కూతురుకు నచ్చజెప్పినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులు చల్దా పోలీస్‌ స్టేషన్‌‌లో వరుడిపై చీటింగ్ కేసు పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed