- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇన్సూరెన్స్’ చేసి చంపుతారు.. బీమా డబ్బు లాగేస్తారు
దిశ, నల్లగొండ క్రైం : జీవిత బీమా క్లెయిముల కోసం పాలసీలు చేయించి హత్యలు చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని నల్లగొండ ఎస్పీ, డీఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. నల్లగొండ పోలీసు కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం వెల్లడించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్ళవాగు తండాకు చెందిన ధీరావత్ రాజు గతంలో నల్లగొండ జిల్లాకేంద్రంలో గోల్డెన్ ట్రస్ట్ ఫైనాన్స్ సర్వీస్ సంస్థలో ఏజెంట్‌గా పనిచేశాడు. ఆ సమయంలో జీవిత బీమా క్లెయిములు ఎలా పొందాలో అవగాహన ఏర్పరుచుకున్నాడు. 10ఏండ్ల క్రితం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ తండాలో సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, అతడు జీవించాడని జీటీఎఫ్ఎస్ సంస్థలో జీవితబీమా నామినీగా అతడి భార్య మొగ్లీని పేరుతో మొదటి ప్రీమియం చెల్లించాడు. అనంతరం సక్రయా మృతి చెందాడని బీమా సంస్థను నమ్మించి, గ్రామ కార్యదర్శి ద్వారా డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. గ్రామానికి విచారణ కోసం వచ్చిన ఆ సంస్థ అధికారులకు రూ.50వేలు లంచంగా ముట్టజెప్పారు. దీంతో పాలసీ క్లెయిమ్ కాగా, రూ.14లక్షలు సక్రియ భార్య మొగ్లీ ఖాతాలో జమ అయ్యాయి. నిందితుడు రాజు మొగ్లీకి రూ.30వేలు మాత్రమే ఇచ్చాడు.
మద్యానికి బానిసలైన వారే టార్గెట్..
మద్యానికి బానిసలైన వారు. అనారోగ్యంగా ఉన్నవారు. భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని టార్గెట్ చేసుకుంటాడు. వారిపేరు మీద జీవితబీమా పాలసీలు కట్టించి, వారిని హతమార్చి రోడ్డు ప్రమాదాలుగా చిత్రించడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నాడు. 2013 నుంచి 2017వరకూ నలుగురు వ్యక్తుల పేరుతో పాలసీలు చేయించి, నామినీల పేరుతో వచ్చే డబ్బును కొంత మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందించి, మగిలిన డబ్బును రాజు కాజేసేవాడు.
కొండ్రపోల్ కేసుతో కటకటాల్లోకి..
కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి దామరచర్ల మండలంలోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో పనిచేస్తూ, మద్యానికి బానిసయ్యాడు. అంతే కాంకుండా కోటిరెడ్డి భార్య హారిక మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న రాజు, ఆమెను మచ్చిక చేసుకుని బీమా పాలసీ కథనం గురించి ఆమెకు వివరించాడు. అప్పటికే ఆమె వివాహేతర సంబంధం కారణంగా.. భర్తను అడ్డుతొలగించుకోవాలని చూస్తున్న ఆమె.. ఇది ఓ మంచి అవకాశంగా భావించి, తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కొండల్ అనే వ్యక్తికి ఈ ప్లాన్ మొత్తం వివరించింది. బీమా క్లెయిం అవ్వగానే వచ్చిన డబ్బును ముగ్గురు పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 2020 మే నెలలో మిర్యాలగూడ పట్టణంలోని మణిపాల్ సిగ్నా ఇన్యూరెన్స్ కంపెనీలో రూ.45లక్షలకు రోడ్డు ప్రమాద బీమా కేర్ పాలసీని తీసుకున్నాడు. అదే సమయంలో కోటిరెడ్డి సంతకాన్ని రాజు పోర్జరీ చేసి మొదటి ప్రీమియాన్ని ఆ కంపెనీకి చెల్లించారు. రెలిగేర్ ఇన్సూరెన్స్ కంపెనీలోనూ కోటిరెడ్డి పేరుతో రూ.50లక్షల పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ, జూన్ నెలలో రిలయన్స్ కంపెనీలో రూ.25లక్షల పర్సనల్ ఇన్యూరెన్స్ పాలసీ చేయించి, మొదటి ప్రీమియం చెల్లించాడు. కోటిరెడ్డిని హతమార్చడానికి పలు ప్రయాత్నాలు చేస్తుండగా పాత నేరస్థుడు దైద హుస్సేన్, మిర్యాలగూడకు చెందిన కంచి శివ, సాయి అనే ఆటోడ్రైవర్‌తో కోటిరెడ్డిని హతమార్చేందుకు రూ.2లక్షలకు ఒప్పందం కుదుర్చుకుందని మొదటి సారి కోటిరెడ్డిని హతమార్చేందుకు విఫలం అయ్యారు. ఫిబ్రవరి 24, 2021న కోటిరెడ్డి రాత్రి 8.30కు ఇంటికి వెళుతున్న సమయంలో సాయి, శివ ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి, పిడిగుద్దులు గుద్ది కోటిరెడ్డిని హతమార్చారు. కోటిరెడ్డి మృతదేహాన్ని బొత్తలపాలెం సమీపంలో అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై పడేశారు. వెనుకాలే ట్రాక్టర్‌పై వచ్చిన రాజు.. కోటిరెడ్డి మృతదేహంపై ట్రాక్టర్ ఎక్కించి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించారు. ఈ విషయం అన్ని పత్రికల్లో రావడంతో రాజు భయపడి పారిపోయేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టబడ్డారు. విచారించగా నేరాలన్నీ ఒప్పుకున్నాడు.
రాజు నేరాల చిట్టా..
2013లో హరిచంద్ అనే బంధువు ద్వారా మిర్యాలగూడెం జటావత్ తండాలో రూపావత్ దేవా టీబీతో బాధపడుతున్నాడు. అతడి భార్య ధనమ్మ అలియాస్ గమ్మా రూపావత్ హేమానాయక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉంది. వారిని నమ్మించిన రాజు బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.10లక్షలకు పాలసీ చేయించి ఆ తర్వాత దేవాను మిర్యాలగూడలో మద్యం తాపించి గూగులోతు చంటి అనే ఆటోడ్రైవర్ సహకారంతో జటావత్ తండా శివారుకు తీసుకు వెళ్లారు. అక్కడ పిడిగుద్దులు గుద్ది హతమార్చి శివారు ప్రాంతంలో పడేసి వెళ్లారు. ఇన్సూరెన్స్ క్లైయిం చేసుకుని రూ.10.40 లక్షలు రాగా, గమ్మాకు రూ.4లక్షలు ఇచ్చారు. 2015లో కొండ్రపోల్ గ్రామానికి చెందిన పరంగి సోమయ్య టీబీ మూర్చవ్యాదితో బాధపడుతున్నాడు. అతడి భార్య ఏసమ్మ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి, ఆ గ్రామ సర్పంచ్ మున్యానయక్ సమక్షంలో ఏసమ్మకు రూ.4లక్షలు ఇచ్చేలా ఒప్పంద పత్రం రాయించుకుని, శ్రీరాం ఫైనాన్స్, రూ. 7లక్షలు, రిలయన్స్ లో రూ.3లక్షలకు సోమయ్య పేరుతో పాలసీలు తీసుకున్నారు. కొండ్రపోల్ శివారులో మద్యంమత్తులో ఉన్న సోమయ్యను ట్రాలీ ఆటోతో ఢీకొట్టి హతమార్చి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించారు. మృతుడు సోమయ్య కుమారుడు అశోక్‌కు అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం2014 సంవత్సరంలో కల్లేపల్లికి చెందిన ధీరావత్ లాల్ సింగ్‌ను , అతడి భార్యతో చేతులు కలపి మిర్యాలగూడ పట్టణానికి తీసుకువచ్చి హతమార్చారు. 2016లో కొండ్రపోల్‌కు చెందిన దైద హుస్సేన్ పేరుతో రూ.53లక్షలకు పాలసీలు చేయించి, అతడి భార్య దైదలింగమ్మ సహకారంతో హతమార్చి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించారు. 2017లో రాళ్లవాగు తండాకు చెందిన సపావత్ తుల్యాపేరుతో రూ.60లక్షలకు పాలసీలు చేయించి హతమార్చారు. అనంతరం గూడూరు పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో చనిపోయిన మనిషిపేరుతో పాలసీలు చేయించి, పోలీసులకు అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లాడు. జైలునుంచి బయటకు వచ్చిన అనంతరం గూంటూరు జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామానికి చెందిన భూక్యా నాగులు నాయక్ అనారోగ్యంతో చనిపోగా, రోడ్డుప్రమాదంగా చిత్రీకరించి క్లెయిమ్ పొందేందుకు ప్రయత్నించిన రాజు విఫలం అయ్యాడు.
రూ.3.39కోట్లకు ప్లాన్, రూ.1.59 ఖతం
ఇన్సూరెన్స్ క్లైయిం ద్వారా రూ.3కోట్ల 39 లక్షలు కొట్టేయాలని పథకం వేసుకున్నా రూ.1కోటి 59లక్షల 40వేలు మాత్రమే మాయం చేశారు. అప్పట్లో విధినిర్వహణలో ఉన్న పోలీసులు రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ చేపట్టకపోవడం నేరస్థులకు బలాన్ని చేకూర్చింది. ఈ హత్యలు జరిగిన సమయంలో ఉన్న పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు. ముందుగానే హత్యకాబడిన వ్యక్తిని రోడ్డుప్రమాదంగా చిత్రీకరిచిన అనంతరం పోస్టుమార్టం రిపోర్టు వెళ్లగా డాక్టర్లు తమ విధులను సమగ్రంగా నిర్వహిస్తే ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసుండేవికావు.
మరికొంతమంది నిందితుల గుర్తింపు
ఈ కేసుల్లోని నిందుతులైన ధీరవాత్ రాజు, కంచి శివ, మందారి సాయిసంపత్, దేవిరెడ్డి హారిక, మేముల కొండల్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. వీరే కాకుండా మరో15 మంది నిందితులను గుర్తించామని, ఐదుగురు ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు, ఏజెంట్లను, ఓ బ్యాంక్ అధికారిని, ఇన్సూరెన్స్ పంపకాల్లో గొడవ జరిగినప్పుడు గ్రామంలో పంచాయతీ పెట్టి డబ్బుల్లో వాటాలు తీసుకున్న 11మంది గ్రామపెద్దలను గుర్తించామని.. వారందరినీ త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, రూరల్ సీఐ రమేష్ బాబు, టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సీఐలు మొగిలయ్య, బాలగోపాల్, ఎస్ఎం భాష, మిర్యాలగూడ రూరల్, వాడపల్లి ఎస్ఐలు సుధీర్, విజయ్ కుమార్, అడవిదేవులపల్లి ఎస్ఐ వీరశేఖర్, వేములపల్లి ఎస్ఐ డీ.రాజు, మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ సర్దార్ నాయక్, వన్ టౌన్ ఎస్ఐ రవి, పోలీసు సిబ్బందిని అభినందించారు.