స్థిరంగా సేవల రంగం వృద్ధి!

by Harish |   ( Updated:2021-12-03 04:42:53.0  )
స్థిరంగా సేవల రంగం వృద్ధి!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సేవల రంగ కార్యకలాపాలు ఈ ఏడాది నవంబర్‌లో దశాబ్దంలోనే రెండో వేగవంతమైన పెరుగుదలను నమోదు చేసింది. అయితే, అక్టోబర్‌లో నమోదైన 58.4 పాయింట్ల కంటే స్వల్పంగా 58.1కి తగ్గిందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా శుక్రవారం వెల్లడించింది. ఐహెచ్ఎస్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. నవంబర్‌లో వ్యాపార విశ్వాసం మూడు నెలల గరిష్ఠ స్థాయికి మెరుగుపడినప్పటికీ, సానుకూల సెంటిమెంట్ దీర్ఘకాల సగటు కంటే తక్కువ ఉంది.

కొన్ని కంపెనీలు వచ్చే ఏడాది అధిక వ్యాపార కార్యకలాపాలను అంచనా వేసినప్పటికీ ధరల ఒత్తిడి కారణంగా విస్తరణను పరిమితం చేస్తున్నాయి. ఇదే సమయంలో కొత్త ఆర్డర్లలో గణనీయమైన పెరుగుదల సేవా రంగం వృద్ధి కి దారి తీసిందని వివరించింది. ‘సర్వీసెస్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) నవంబర్‌లో 58.1 వద్ద నమోదవడంతో 2011, జూలై తర్వాత రెండో వేగవంతమైన పెరుగుదలను సాధించింది.

నవంబర్‌లో తయారీ కార్యకలాపాలు 10 నెలల గరిష్ఠంతో అత్యంత వేగంగా వృద్ధి 57.6కి పెరిగింది. తయారీ, సేవల రంగాలను కలిపి చూస్తే పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇప్పటివరకు మెరుగ్గానే ఉందని’ ఐహెచ్‌ఎస్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియానా డీ లిమా అన్నారు. నవంబర్‌లో ప్రైవేట్ రంగ కార్యకలాపాలు స్వల్పంగా మాత్రమే పెరిగాయని లిమా వెల్లడించారు.

Advertisement

Next Story