లడాఖ్‌లో భారత ప్రత్యేక దళాలు

by Shamantha N |   ( Updated:2020-07-02 11:27:58.0  )
లడాఖ్‌లో భారత ప్రత్యేక దళాలు
X

న్యూఢిల్లీ: మూడు రౌండ్‌ల మిలిటరీ శాంతి చర్చలు అసంపూర్తిగానే మిగలడంతో సరిహద్దు ఉద్రిక్తతలు సమసిపోవడానికి సుదీర్ఘ ప్రక్రియకు ఇరుదేశాలు ఉపక్రమించాయి. శాంతియుత వాతావరణం నెలకొనేవరకూ మిలిటరీ, దౌత్య చర్చలు జరపాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. చైనా శాంతి ఒప్పందాలను అమలు చేయాలని భావిస్తూనే కేంద్ర రక్షణమంత్రి గురువారం నాటి లడాఖ్ పర్యటనను వాయిదా వేశారు. గురువారం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణెతో కలిసి సరిహద్దులో భారత సైన్యం సన్నద్ధత, పరిస్థితులను పర్యవేక్షించాలని షెడ్యూల్ ప్రకటించుకున్నా, దాన్ని వాయిదా వేశారు. కాగా, ఒకవైపు శాంతి పలుకులు మాట్లాడుతూనే, మరోవైపు సరిహద్దులో భారీగా బలగాలను మోహరిస్తూ భారత భూభాగంలోకి డ్రాగన్ చొచ్చుకువస్తుండటంతో కేంద్రం ముందుజాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. చైనా బలగాలు, యుద్ధ సన్నద్ధతకు దీటుగా భారత్ కూడా సరిహద్దులో మోహరించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. చైనా ఎటువంటి దుస్సాహసానికి ఒడిగట్టినా తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా, లడాఖ్‌లోని ఎల్ఏసీ గుండా స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లను మోహరించింది. పాకిస్తాన్‌లోని టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసిన 2017 సర్జికల్ స్ట్రైక్‌లో ప్రత్యేక దళాలు కీలక పాత్ర పోషించాయి. అడవీ, ఎడారి, పర్వతాలు ఎటువంటి వాతావరణంలోనైనా తట్టుకుని లక్ష్యాన్ని ఛేదించేలా ఈ ప్రత్యేక దళాలు సంసిద్ధమై ఉంటాయి. మన దేశంలో 12కు పైగానే ఈ దళాల రెజిమెంట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రత్యేక దళాలను సరిహద్దుకు సమీపాన మోహరించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా కవ్విస్తే ఎలా వ్యవహరించాలో కూడా సూచనలు చేసినట్టు వివరించాయి.

21 మిగ్, 12 సుఖోయ్ విమానాలు:

కొత్తగా 33యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, 59 మిగ్ యుద్ధ విమానాలను ఉన్నతీకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి ఈ నెల 27వరకు భారత్‌కు చేరనున్న సంగతి తెలిసిందే. తాజాగా, 21 మిగ్-29 ఎయిర్‌క్రాఫ్టులను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి కేంద్ర రక్షణశాఖ ఆమోదం తెలిపింది. అలాగే, 12 సుఖోయ్-30ఎంకేఐ విమానాలను హిందూస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి కొనుగోలు చేయడానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఓసీ) సమ్మతం తెలిపింది. వీటితోపాటు క్షిపణుల కొనుగోలును ఆమోదించినట్టు తెలిసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డీఓసీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం రూ.38,900 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రష్యా నుంచి మిగ్-29 కొనుగోలు, ఉన్నతీకరణ కోసం రూ.7,418 కోట్లు, హెచ్ఏఎల్ నుంచి 12 సుఖోయ్ విమానాల కొనుగోలుకు రూ.10,730 కోట్లు ఖర్చవుతాయని కేంద్ర రక్షణశాఖ ఈ సమావేశానంతర ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వైమానిక రంగానికి కావల్సిన ఆయుధాలు, క్షిపణులను సమకూర్చుకోవాల్సిన అవసరమున్నదని, ప్రధాని పిలుపునిచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’‌కు అనుగుణంగానే ఈ ప్రతిపాదనల అమలు ఉంటుందని వివరించింది. తయారీరంగంలో ఎంఎస్ఎంఈలను చేర్చి స్వావలంబన భారత్‌గా ఎదగేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో కొన్నింటిలో దాదాపు 80శాతం కంటెంట్ కేవలం స్థానికంగా తయారైనవే ఉంటాయని పేర్కొంది.

ప్యాంగాంగ్ సరస్సులోనూ గట్టి నిఘా:

ప్యాంగాంగ్ సో ఏరియాలోకి చైనా సైన్యం చొరబడటంతో మే నెల నుంచి ఇరుదేశాల మిలిటరీ మధ్య ఘర్షణలు కొనసాగిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్యాంగాంగ్ సరస్సు సమీపంలో చైనా హెలిప్యాడ్ నిర్మాణాన్ని చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే శత్రువులపై నిఘా వేసే అధునాతన పరికరాన్ని కలిగి వేగంగా వారిని వెనక్కి పంపించే సామర్థ్యమున్న బోట్లను భారత్ ఈ సరస్సులో మోహరించనుంది. హైస్పీడ్ ఇంటర్‌సెప్టర్ బోట్లను ఈ సరస్సుకు పంపించే ప్రతిపాదనపై కేంద్ర రక్షణశాఖ తుది నిర్ణయం తీసుకోనున్నది. అంతేకాదు, దూరం నుంచే పసిగట్టే 248 ఆస్ట్రా ఎయిర్‌ టు ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ క్షిపణులు, వైమానిక, నేవీ దళాలలకు ఉపకరించనున్నాయి.

డిజిటల్ స్ట్రైక్‌తో దిగొచ్చిన చైనా?

ద్వైపాక్షిక ఒప్పందాలు, నిబంధనలను పాటించి సరిహద్దులో శాంతియుత వాతావరణానికి చైనా దోహదపడాలని, ఈ చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ సూచించారు. అలాగే, చైనా యాప్‌ల నిషేధంపై స్పందిస్తూ భారత నియమ నిబంధనలు, వివిధ శాఖల ప్రతిపాదనలు, ముఖ్యంగా సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలకు సంబంధించి భారత్ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. కాగా, అంతర్జాతీయ వాణిజ్యం సంస్థ చట్టాలు సహా పలు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నదని చైనా ఆరోపించింది. చైనాలో భారత సంస్థలపట్ల వివక్షాపూరితంగా వ్యవహరించడం లేదని తెలిపింది. భారత్ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నట్టు చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed