- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పిన్నర్లకు ఇంగ్లాండ్ దాసోహం.. సత్తా చాటిన సిరాజ్
దిశ, స్పోర్ట్స్: అందరూ ఊహించినట్లే నాలుగో టెస్టుకు ఉపయోగించిన పిచ్ కూడా స్పిన్నర్లకు పూర్తిగా సహకరించింది. అక్షర్, అశ్విన్‌లను త్వరగా బౌలింగ్‌కు దింపిన కెప్టెన్ కోహ్లీ.. సరైన ఫలితాలనే రాబట్టాడు. స్పిన్నర్లకు తోడు పేసర్ సిరాజ్ కూడా నిప్పులు చెరిగే బంతులు వేయడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ తడబడ్డారు. మూడో టెస్టు లాగా స్వల్ప స్కోరుకే ఆలౌట్ అవుతారని భావించారు. అయితే బెన్ స్టోక్స్ అర్ద సెంచరీతో రాణించగా.. డాన్ లారెన్స్, ఓల్లీ పోప్ కాస్త పరుగులు రాబట్టారు. కానీ తొలి రోజు పూర్తిగా ఆడలేక 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా గిల్ వికెట్ కోల్పోయింది. మొత్తంగా చూసుకుంటే తొలి రోజు భారత జట్టే ఆధిపత్యం ప్రదర్శించింది.
పేటీఎం సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఇండియా మధ్య నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం ప్రారంభమైంది. టాస్ గెల్చిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయారు. ఓపెనర్లు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన కోహ్లీ బంతనికి అక్షర్‌కు అందించాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లు డాబ్ సిబ్లే (2), జాక్ క్రాలీ (9) లను పెవీలియన్ పంపాడు. డామ్ సిబ్లే క్లీన్ బౌల్డ్ కాగా, జాక్ క్రాలీ మహ్మద్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక కెప్టెన్ జో రూట్ (5) మరోసారి విఫలమయ్యాడు. బుమ్రా గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించాడు. జో రూట్ (5) సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 30/3. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్‌తో కలసి జానీ బెయిర్‌స్టో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కలసి ఆచితూచి ఆడుతూ ఆ సెషన్‌లో మరో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు. లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.
ఇక రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే మహ్మద్ సిరాజ్ ప్రమాదకరంగా మారుతున్న బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్ జోడీని విడదీశాడు. జానీ బెయిర్ స్టో (28) సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఓల్లీ పోప్ చక్కని సహకారం అందించాడు. దీంతో బెన్ స్టోక్స్ బ్యాట్ ఝులిపించడం ప్రారంభించాడు. భారత బౌలర్లపై ఎదురు దాడి ప్రారంభించి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 114 బంతుల్లో స్టోక్స్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో స్టోక్స్‌కు ఇది 24వ హాఫ్ సెంచరీ. అయితే స్టోక్స్ (55) అర్దసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే అవుటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. స్టోక్స్ రివ్యూకి వెళ్లినా ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత ఓల్లీ పోప్, డాన్ లారెన్స్ మరో వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు టీ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
టీ విరామం తర్వాత కూడా ఓల్లీ పోప్, డాన్ లారెన్స్ నిలకడగా ఆడారు. వీరిద్దరూ కలసి ఆరో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో శుభమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఓల్లీపోప్ (29) పెవీలియన్ చేరాడు. ఇక అప్పటి నుంచి ఇంగ్లాండ్ జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. మంచి ఫామ్‌లో ఉన్న బెన్ ఫోక్స్ (1) అశ్విన్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అర్దసెంచరీకి చేరువైన్ డాన్ లారెన్స్ (46) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పంత్ స్టంప్ అవుట్ చేశాడు. డామ్ బెస్ (7), జాక్ లీచ్ (7) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. అండర్సన్ (10) నాటౌట్ గా నిలిచాడు. భారత స్పిన్నర్లు అక్షర్, అశ్విన్ ద్వయం ఇంగ్లాండ్ జట్టును ఇబ్బంది పెట్టింది. వీరిద్దరే కలసి 7 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 75.5 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అక్షర్ 4, అశ్విన్ 3, సిరాజ్ 2 వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ లభించింది.
ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు తొలి ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ సిరీస్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న గిల్ (0) అండర్సన్ వేసిన తొలి ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. రివ్యూకి వెళ్లినా అంపైర్స్ కాల్ కావడంతో పెవీలియన్ చేరకతప్పలేదు. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ (8), చతేశ్వర్ పుజారా (15) ఎలాంటి తప్పులు చేయకుండా ఆచితూచి ఆడారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా 1 వికెట్ కోల్పోయి 24 పరుగులు చేసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 181 పరుగులు వెనుకబడే ఉన్నది.
స్కోర్ బోర్డు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్
జాక్ క్రాలీ (సి) మహ్మద్ సిరాజ్ (బి) అక్షర్ పటేల్ 9, డామ్ సిబ్లే (బి) అక్షర్ పటేల్ 2, జానీ బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ)(బి) మహ్మద్ సిరాజ్ 28, జో రూట్ (ఎల్బీడబ్ల్యూ)(బి) 5, బెన్ స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ)(బి) వాషింగ్టన్ సుందర్ 55, ఓల్లీ పోప్ (సి) శుభమన్ గిల్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 29, డాన్ లారెన్స్ (స్టంప్) రిషబ్ పంత్ (బి) అక్షర్ పటేల్ 46, బెన్ ఫోక్స్ (సి) అజింక్య రహానే (బి) రవిచంద్రన్ అశ్విన్ 1, డామ్ బెస్ (ఎల్బీడబ్ల్యూ)(బి) అక్షర్ పటేల్ 3, జాక్ లీచ్ (ఎల్బీడబ్ల్యూ)(బి) అశ్విన్ 7, జేమ్స్ అండర్సన్ 10 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (75.5 ఓవర్లు) 205 ఆలౌట్
వికెట్ల పతనం : 1-10, 2-15, 3-30, 4-78, 5-121, 6-166, 7-170, 8-188, 9-189, 10-205
బౌలింగ్ : ఇషాంత్ శర్మ (9-2-23-0), మహ్మద్ సిరాజ్ (14-2-45-2), అక్షర్ పటేల్ (26-7-68-4), రవిచంద్రన్ అశ్విన్ (19.5-4-47-3), వాషింగ్టన్ సుందర్ (7-1-14-1)
ఇండియా తొలి ఇన్నింగ్స్
శుభమన్ గిల్ (ఎల్బీడబ్ల్యూ)(బి) జేమ్స్ అండర్సన్ 0, రోహిత్ శర్మ 8 బ్యాటింగ్, చతేశ్వర్ పుజార 15 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (12 ఓవర్లు) 24/1
వికెట్ల పతనం : 1-0
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ (5-5-0-1), బెన్ స్టోక్స్ (2-1-4-0), జాక్ లీచ్ (4-0-16-0), డామ్ బెస్ (1-0-4-0)