- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినం..
దిశ, న్యూస్ బ్యూరో:
రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలుచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లకు అదనంగా ప్రత్యేకాధికారులను నియమించింది. స్వయంగా ప్రధాన కార్యదర్శి, డీజీపీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. కరోనా వ్యాధికి మందు, చికిత్స లేనందున లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని భావించిన ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలనుకుంటోంది. ఆంక్షలు ఉన్నప్పటికీ వేలాది వాహనాలు రోడ్డుమీదకు వస్తుండడంతో నియంత్రించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. దీన్ని కట్టడి చేయడానికి సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. సామాన్యుల మొదలు ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఆంక్షలు విధించింది. ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేస్తే తప్ప కంట్రోల్ చేయడం సాధ్యం కాదని క్షేత్రస్థాయిలోని పోలీసు అధికారుల ఫీడ్‌బ్యాక్ మేరకు ఈ సర్క్యులర్ జారీ చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు కార్డు మాత్రమే సరిపోదని, ప్రత్యేకంగా వారి ఆఫీసు నుంచి పాస్ మంజూరు కావాల్సిందేనని ఆ సర్క్యులర్ స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకావడాన్ని అనుమతించేది లేదని, ఇళ్ళకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. అవసరంలేకున్నా రోడ్లమీదకు వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్ని ఆంక్షలను సడలించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యధావిధిగా ఆంక్షలు కొనసాగుతాయని చెప్పడంతో పాటు మరింత కఠినం చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల వెలుగులో ఈ సర్క్యులర్‌లో 30 అంశాలను ప్రస్తావించింది. విధిగా ప్రతీ ప్రభుత్వ విభాగం అందులో పనిచేసే ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సి వస్తే జారీ చేయాల్సిన పాస్‌లో పేర్కొనే అంశాలను కూడా వివరించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసి పరిధిలోని ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులే అయినా ఆఫీసుకు రావాల్సిన అవసరం లేకున్నా గుర్తింపు కార్డుతో రోడ్లమీదకు వస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. నిత్యావసర వస్తువులమ్మే సూపర్ మార్కెట్‌లు, కిరాణా దుకాణాలకు సైతం విస్తృతంగా హాజరవుతున్నందున సాయంత్రం వరకూ కాకుండా మధ్యాహ్నానికే మూసేయాల్సిందిగా స్థానిక పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి.
ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లోని కొన్ని అంశాలు :
1. కంటైన్‌మెంట్ జోన్ (క్లస్టర్)లో నివసిస్తున్న, దానికి మూడు కి.మీ. పరిధిలోని బఫర్ జోన్‌లో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు వెళ్ళడానికి వీలు లేదు.
2. రొటేషన్ పద్ధతిలో కనీస సంఖ్యలో ఉద్యోగులను ఆయా శాఖల ఉన్నతాధికారులు విధులకు హాజరయ్యేలా చూసుకోవాలి.
3. వృద్ధులు, గర్భిణులు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులు ఉన్నట్లయితే వారిని విధులకు హాజరయ్యేలా వత్తిడి తేవద్దు. తప్పనిసరి అయితే మాత్రమే వారు ఆఫీసులకు హాజరుకావచ్చు.
4. ఏ ఉద్యోగి ఏ రోజు ఏ సమయంలో ఏ రూట్‌లో ఆఫీసుకు వస్తున్నారో నిర్దిష్టంగా పేర్కొంటూ సంబంధిత శాఖ ఉన్నతాధికారి పాస్‌ను జారీ చేయాలి. పాస్‌లు జారీచేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పరిమిత సంఖ్యలో సిబ్బందితో పనులు జరిగేలా ఉన్నాధికారులు ప్లాన్ చేసుకోవాలి.
5. ఆఫీసుల్లోకి సందర్శకులను దాదాపుగా పూర్తిగా నిషేధించాలి. ఆఫీసర్ అనుమతి ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలి.
6. ఒకే ఆఫీసులో ఐదుగురి కంటే ఎక్కువమంది పనిచేయాల్సి వస్తే వారి మధ్య కచ్చితంగా కనీసం ఆరడగుల దూరం పాటించాలి.
7. ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు కమ్యూనికేషన్ లేదా ఫైళ్ళను పంపాల్సి వస్తే వీలైనంతవరకు ఇ-మెయిల్ లేదా డిజిటల్ రూపంలోనే జరగాలి.
8. విధులకు హాజరయ్యే సిబ్బంది ఆరోగ్య రక్షణ విషయంలో తప్పనిసరి నిబంధనలను పాటించాలి.
అనారోగ్యంపాలైతే వెంటనే వారిని క్వారంటైన్‌కు పంపేలా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాలి.
9. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఉద్యోగులు వైరస్ బారిన పడకుండా ఉండేలా ‘ఫ్రంట్ లైన్’ పనులు అప్పగించవద్దు.
10. ఆఫీసుకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి.
ఇకపై 28 రోజుల క్వారంటైన్?
ఇప్పటిదాకా వైరస్ ఇన్‌క్యుబేషన్ కాలాన్ని గరిష్టంగా 14 రోజులు అని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి) నిర్ణయించినప్పటికీ ఒకటిన్నర నెల రోజుల అనుభవంలో వెలుగులోకి వస్తున్న పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా ఆ కాలాన్ని 28 రోజులకు పొడిగించుకున్నాయి. అస్సాం, కేరళ, గోవా, ఒడిషా లాంటి పలు రాష్ట్రాలు ప్రస్తుతం క్వారంటైన్ కాలాన్ని 28 రోజులుగానే పరిగణిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం గత కొంత కాలంగా ఇదే విధానాన్ని పాటిస్తోంది. ఇప్పుడు అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా లక్షణాలు బైటపడకపోయినా అనుమానితులుగా భావించినట్లయితే వారిని 28 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంచాలని, స్థానికంగా ఉన్న వైద్య బృందాలు ప్రతీరోజూ వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తూ ఉండాలని సీఎస్ పేర్కొన్నారు. హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నట్లు వారి చేతులకు స్టాంప్ వేయాలని సూచించారు.
సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు వద్దు..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఒక పాజిటివ్ పేషెంట్‌తో ఎంత మంది ఎన్ని స్థాయిల్లో కాంటాక్టులోకి వెళ్ళారో ఇప్పటికే ప్రభుత్వ వైద్య సిబ్బంది వివరాలను సేకరిస్తూ ఉన్నారు. లక్షణాలు ఉన్నవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కొన్నిసార్లు లక్షణాలు లేకున్నా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. దీన్ని లోతుగా అధ్యయనం చేసిన ప్రభుత్వం ఇకపైన ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని, సెకండరీ కాంటాక్టు వ్యక్తులకు అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. ఒక పాజిటివ్ పేషెంట్‌కు ప్రైమరీ కాంటాక్టుగా ఉన్నవారికి మాత్రమే ఇలాంటి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే సెకండరీ కాంటాక్టు వ్యక్తుల విషయంలో మాత్రం స్టాంపు వేసి హోమ్ క్వారంటైన్‌కు పరిమితం చేయాలి తప్ప నిర్ధారణ పరీక్షలు చేయవద్దని స్పష్టం చేశారు. 28 రోజుల పాటు ఎలాగూ క్వారంటైన్‌లో ఉంటున్నందున నిబంధనలను సదరు వ్యక్తి పాటిస్తున్నారో లేదో పరిశీలిస్తూ వారి ఆరోగ్య స్థితిగతులను ప్రతీరోజూ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు దీన్ని పాటించాలని స్పష్టం చేశారు.