- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏందిదీ? మా రాత మారదా?
దిశ, మహబూబ్ నగర్: ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి. అర్హత ఉన్నా ఫలాలు అందడంలేదు. ఈసారైనా మా రాత మారుతుందేమోనని ఆశపడిన ఆ జనానికి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఇదేమీ న్యాయమంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
విషయమేమిటంటే.. బడ్జెట్ కేటాయింపుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. జిల్లాకు అధిక నిధులు కేటాయించేందుకు అవకాశాలున్నా గతంలో మాదిరిగానే ఈసారి కూడా జిల్లాకు మొండిచేయినే చూపించింది. తలసరి ఆదాయపరంగా చూస్తే తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాలుగోస్థానంలో ఉంది. వ్యసాయంపై కూడా ఆధారపడ్డవారు ఈ జిల్లాలో ఎక్కువే. పారిశ్రామిక రంగం, వైద్య, విద్య రంగాలతోపాటు పలు రంగాల్లో కూడా ఇప్పటివరకు ఈ జిల్లాలో అంతగా అభివృద్ధి జరగలేదు. ఓ వైపు ఆదాయపరంగా అగ్రస్థానంలో ఉండడం.. మరోవైపు అభివృద్ధికి నోచుకోకపోవడం.. ఇలా ఏ రకంగా చూసినా జిల్లాకు అధిక నిధులు కేటాయించేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కానీ, ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో జిల్లాపై ప్రభుత్వం పాత ధోరణే పాటించిందంటూ ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది తప్ప ఆ దిశగా అడుగులు వేయడంలేదుంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అయినా కూడా..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు నిధులు ఆశించిన మేర కేటాయించలేదు. కనీస మౌలిక అవసరాలకు కూడా నిధులు కేటాయించలేదు. ఉమ్మడి జిల్లా తలసరి అదాయం పరంగా చూస్తే జిల్లాలో రూ.1,32,332 ఉండగా రాష్ట్రంలో ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లా రూ.1,94.229తో 4వ స్థానంలో ఉంది. అందులో జోగులాంబ గద్వాల రూ.1,33,755తో 22వ స్థానంలో, రూ. 1,17,844తో వనపర్తి 30వ స్థానంలో, రూ.1,17,614తో నాగర్ కర్నూల్ 31వ స్థానంలో, రూ.98,220తో 33వ స్థానంలో నారాయణపేట జిల్లా ఉంది. ఈ విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా తలసారి ఆదాయంలో అగ్ర భాగాన ఉంది. మరో పక్క ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కువగా వ్యవసాయంపై అధారపడినవారే ఉంటారు. నారాయణపేటలో అత్యధికంగా నిరక్షరాస్యులు ఉంటారు. మరోవైపు జిల్లాలో పాలమూరు యూనివర్సిటీని స్థాపించి దశాబ్దంన్నర కావస్తున్నా నేటికి ఆ యూనివర్సిటీలో కావాల్సిన మౌలిక వసతులు కూడా లేవు. ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు కావాల్సిన విద్యారంగానికి అవసరమైన నిధులు కేటాయించలేదు. సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం అటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పారిశ్రామికరంగం పరంగా, డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాల విషయంలో మాత్రం పూర్తిగా విస్మరించింది. అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యకలాపాల విషయంలో కూడా నివేదికలకు అనుగుణంగా జిల్లాకు నిధుల కేటాయింపు జరగలేదు. ఈ ధోరణిని గమనిస్తే పాలమూరు విద్యారంగానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది.
తాత్సారం తప్పేలా లేదు
దేవాలయాల విషయంలో కూడా అశించిన మేర నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఈ సంవత్సరం కూడా జిల్లాలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి పనులలో తాత్సారం తప్పేలా లేదు. రాష్ర్టంలోని వివిధ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను కేటాయించింది. కానీ, శక్తిపీఠంగా గుర్తింపు పొందిన ఆలంపూర్‌లోని జోగులాంబ దేవస్థానానికి మాత్రం ఎలాంటి నిధులను కేటాయించకపోవడం జిల్లావాసులను నిరాశపరిచింది. కేవలం దూపదీప నైవేద్యాలకు మాత్రమే జిల్లాలోని సుమారు 300 దేవాలయాలకు నిధులను కేటాయించింది. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా సుమారు 1,340 దేవాలయాలు ఉండగా వాటిలో 10 6ఏ, 17 6బి, 21 6సి కింద ఉన్నాయి. అందుకు తగిన విధంగా నిధులు కేటాయించలేదు.
మాటలేగానీ చేతలు లేవు
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు సైతం గతంలో పలుసార్లు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులు మాత్రం వేయలేదు. కనీసం ఈ బడ్జెట్లో అయినా నిధుల కేటాయింపులు జరుగుతాయనుకుంటే మరోమారు జిల్లావాసులకు నిరాశే ఎదురైంది. వనపర్తిలో వేరుశనగ పరిశోధన కేంద్రం, బీచుపల్లి ఆయిల్ మిల్లు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ, ప్రభుత్వం అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. దామరగిద్దలో సీతాఫలం, వనపర్తిలో వేరుశనగకు సంబంధించి మహిళాసంఘాలు చిన్నచిన్న కేంద్రాలను ఇప్పటికే నిర్వహిస్తున్నాయి. వీటి మాదిరిగా అన్ని నియోజకవర్గాలో కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం బడ్జెట్లో ఆ విషయాన్నే పొందుపర్చలేదు. దీంతో ఇదేందంటూ జిల్లా ప్రజలు విస్మయానికి గురయ్యారు.
ఈసారైనా..
పాలమూరు యూనివర్సిటీ విషయానికి వస్తే యూనివర్సీటి అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిధుల కేటాయింపులు జరగలేదు. గత ఆర్థిక సంవత్సరం కూడా నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఇసారైనా నిధుల కేటాయింపులు వుంటాయనే అందరూ భావించారు. గత ఆర్థిక సంవత్సరం కేవలం రూ.6.63 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈసారి కూడా కేవలం వేతనాల కోసం రూ.7.36 కోట్లను కేటాయించింది. ఈ నిధులు కూడా వేతనాలకు సరిపోవని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి విశ్వవిద్యాలయంలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలతోపాటు యూనివర్సిటీ నిర్వాహణ కోసం రూ. 26 కోట్లు కావాలని యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ, ప్రభుత్వం మాత్రం కేవలం రెగ్యులర్ సిబ్బంది వేతనాలకు సరిపడా నిధులను మాత్రమే కేటాయించింది. యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.90 కోట్లు కావాలని కూడా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అందులో రూ.10 కోట్లు అత్యవసరంగా పీజీ కేంద్రంలో బాలికల వసతిగృహ నిర్మాణం కోసం, యూనివర్సిటీ ఆవరణలో ప్రాథమిక అరోగ్య కేంద్రానికి రూ.4 కోట్లు, నీటి వసతి ఏర్పాటు కోసం రూ.2 కోట్లతోపాటు, యూనివర్సిటీలో పరిశోధన కేంద్రం, మినీ స్టేడియం, వనపర్తి పీజీ కేంద్రంలో వసతిగృహాల నిర్మాణాల కోసం కూడా నిధులను కేటాయించాలంటూ అందులో పేర్కొన్నారు. ఇలా యూనివర్సిటీ అధికారులు వివిధ రూపాలలో మొత్తం రూ.116 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపితే.. అందులో కేవలం 5 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం కేటాయించడం శోచనీయం.
ఇటు వైద్యరంగం విషయంలో కూడా అన్యాయమే..
వైద్య రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం జిల్లాకు పెద్దగా నిధుల కేటాయింపులు జరపలేదు. ముఖ్యంగా వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు నేటికి కూడా ముందుకు సాగడంలేదు. ఈసారి బడ్జెట్లో కూడా దానిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో మరో ఏడాదిపాటు జిల్లా గ్రామీణ ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది.
ఇలా నిరాశజనకంగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు నిధులు కేటాయించింది. దీంతో జిల్లా ప్రజలు విమర్శలు చేస్తున్నారు. జిల్లా నుండి తలసరి ఆదాయం అధికంగా ఉన్నా నిధుల కేటాయింపులో మాత్రం వివక్ష చూపడమేంటని ప్రతిపక్షాలతోపాటు ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.