నిజామాబాద్ లో ఉలిక్కిపడ్డ జనం

by Shyam |
నిజామాబాద్ లో  ఉలిక్కిపడ్డ జనం
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లాక్ డౌన్ కొనసాగుతున్న ఈ తరుణంలో అక్కడ మాత్రం ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు లేకపోవడంతో అధికారులందరూ సాదాసీదాగానే విషయాన్ని పరిగణనలోనికి తీసుకున్నారు. కానీ, ఓ రిటైర్డ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పుడంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అదేంటో ప్రత్యేక కథనంలో చూడండి..

జనతా కర్ఫ్యూ జరిగి ఏడు రోజులు గడిచింది. లాక్ డౌన్ మొదలై ఆరు రోజులు గడుస్తోంది. అయితే.. నిజామాబాద్ జిల్లాలో ఒక్క పాజిటీవ్ కేసు నమోదు కాలేదని ధీమాగా ఉన్న నిజామాబాద్ అధికార యంత్రాంగానికి ఒకే ఒక పాజిటివ్ కేసు ముచ్చేమటలు పట్టిస్తోంది. తెలంగాణ రాష్ర్టంలో గల్ఫ్ బాట పట్టి తిరిగి వచ్చిన విదేశీయులలో ఉమ్మడి నిజామాబాద్ వాసులే మూడున్నర వేల పైచిలుకు. వారందరినీ క్వారంటైన్ లో ఉంచారు. వారిలో 30 మందికి లక్షణాలు ఉన్నాయని పరీక్షలు జరిపిన అక్కడ ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. అదే ధీమాతో ఉన్నవారికి ఎటువంటి విదేశాలకు వెళ్లకుండానే ఒక మతపరమైన సమావేశానికి ఢిల్లీ వెళ్లివచ్చిన వారిలో ఒక్కరికి పాజిటివ్ అని శనివారం నిర్ధారణ రిపోర్టులు రావడంతో కలకలం రేగింది. విదేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చినవారికి పాజిటివ్ లక్షణాలు లేకపోవడం, స్థానికంగా ఇంటి వద్దే ఉండే రిటైర్డ్ ఉద్యోగి ఢిల్లీకి 25 మంది స్థానికులతో కలిసి వెళ్లి రావడం అతనికి ఒక్కడిలోనే తొలుత కరోనా లక్షణాలు రావడం అధికార యంత్రాంగాన్ని తట్టిలేపింది. ఇప్పటి వరకు అప్రమత్తతతో ఉన్న అధికారయంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. లాక్ డౌన్ లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సాదాసీదా తనిఖీలతో సరిపెట్టిన పోలీస్ యంత్రాంగం అదివారం నుంచి పట్టుబిగించింది. కారణం లేకుండా ఇళ్ల నుంచి వచ్చేవారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది.

కుటుంబంతోపాటు కాలనీలో అందరికీ పరీక్షలు..

ఈ నెల 12 నుంచి 15 వరకు ఢిల్లీలో మతపరమైన సమావేశానికి హాజరైన నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి పాజిటివ్ అని తెలియడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్య, ఆరోగ్యశాఖ, పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ శాఖలను సమన్వయం చేస్తూ రంగంలోకి దిగింది అధికార యంత్రాంగం. రిటైర్ట్ ఉద్యోగితో పాటు ఎడుగురిని నర్సింగ్ కళశాలలో ఉన్న ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. రిటైర్డ్ ఉద్యోగి ఈనెల 15న ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి జలుబు, జ్వరంతో బాధపడి 19న ఆసుపత్రిలో చేరాడు. అప్పటివరకు అతను, అతని కుటుంబ సభ్యులు ఎవరిని కలిశారు.. అసుపత్రికి వెళ్లింది.. ప్రార్థనా మంధిరాలకు వెళినప్పటి నుంచి ఇలా మొత్తం ఆరా తీశారు. కాలనీ మొత్తం క్వారంటైన్ మాధిరిగా అధీనంలోకి తీసుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగితో సన్నిహితంగా ఉన్నవారికి హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రిటైర్డ్ ఉద్యోగి ఇంటి పక్కన ఉన్న వారిని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు అధికారులు. అదివారం తెల్లవారే సరికి పారిశుద్ధ్య సిబ్బంది చేత, అగ్నిమాపక శాఖ ద్వారా రసాయనాలు పిచికారీ చేయించారు. ఆదివారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ మొత్తం కాలనీలోని అందరి పరీక్షలకు సిద్ధమయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాన ఖిల్లా రోడ్ ను ఆనుకుని ఉన్న కాలనీ కావడంతో కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు.

రిటైర్డ్ ఉద్యోగితోపాటు 25 మంది డిల్లీకి..

నిజామాబాద్ లో రిటైర్డ్ ఉద్యోగి ఢిల్లీలో మతపరమైన సమావేశంలో పాల్గోని రావడం వల్లనే పాజిటివ్ గా నిర్ధారణకు వచ్చిందని అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. ఢిల్లీలో ఈ నెల రెండవ వారంలో మతపరమైన సమావేశం జరిగింది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులు పాల్గొన్న సమావేశాల్లోనూ రిటైర్డ్ ఉద్యోగి పాల్గొన్నారు. నిజామాబాద్ నుంచి 25 మంది సభ్యులతో ఒక బృందంగా పాల్గొని తిరిగి వచ్చారు. వారిలో అధికంగా నిజామాబాద్ నగరానికి చెందినవారు కాగా మిగిలిన వారు బోధన్, ఆర్మూర్, నవీపేట్, ముదోల్ కు చెందిన వారు ఉన్నారు. 25 మందిలో ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి మాత్రమే పాజిటివ్ రాగా మిగిలిన వారందరికీ హోం క్వారంటైన్ లోనే ఉండాలని సూచించారు. శనివారం రాత్రి వారందరికీ పరీక్షలు నిర్వహించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సదరు రిటైర్డ్ ఉద్యోగితో పాటు రైలులో, ఢిల్లీలో ప్రయాణించినవారికి వైరస్ సోకే అవకాశం ఉండి ఉంటుందని ఆ రోజు రైలులో తిరుగు ప్రయాణంలో వచ్చినవారి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నిజామాబాద్ లో ఎక్కడ తిరిగారు, ఏ ప్రార్థన మందిరంలో ప్రార్థనలు చేశారు.. ఆరోజు ఎంతమంది ప్రార్థనలకు హాజరయ్యారు.. వారిలో ఎవ్వరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా అనే కోణంలోనూ వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఢిల్లీ పాజిటివ్ జాబితాలో నిజామాబాద్ వాసి..

తెలంగాణలో కరోనా పాజిటివ్ లలో సింహభాగం ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరైనవారే అని తెలుస్తోంది. శనివారం వరకు నమోదైన పాజిటివ్ కేసులలో విదేశీయులతోపాటు తెలంగాణవారు అధికంగా ఎఫెక్ట్ అయిందనేది ఢిల్లీ టూర్ అనేది వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ కేవలం కరీంనగర్, హైదరాబాద్ కు పరిమితమని అందరూ అనుకుంటున్న తరుణంలో శనివారం నిజామాబాద్ రిటైర్డ్ ఉద్యోగికి పాజిటివ్ అని తేలడం కలవరపెడుతుంది. ఇప్పటికే కరీంనగర్ లో రెడ్ జోన్ ఏర్పాటు చేసి నిర్భంధంగా క్వారంటైన్ ను అమలు చేస్తున్నారు.

Tags : nizamabad, corona case, officer, delhi, hyderabad, police, retired employee

Advertisement

Next Story