మహదేవపూర్‌లో అక్రమాలు.. ఆ బకెట్‌తో ప్రభుత్వానికి రూ. 72 కోట్ల నష్టం

by Shyam |
మహదేవపూర్‌లో అక్రమాలు.. ఆ బకెట్‌తో ప్రభుత్వానికి రూ. 72 కోట్ల నష్టం
X

దిశ, మహదేవపూర్: తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అక్రమార్జనలో అందరూ వాటాలు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని ఒక్క రోజుకు రూ. 20 లక్షలు అక్రమంగా దండుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి లేకుండా అమ్మకాలను జరుపుతున్నప్పటికీ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఒక్కో బకెట్‌కు రూ. 2 వేల చొప్పున వసూలు చేస్తూ.. కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సులువుగా దోచేస్తున్నారు.

మహదేవపూర్ మండలంలో దాదాపు 27 క్వారీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. అందులో 15 క్వారీలు నడుస్తున్నప్పటికీ, ప్రతి క్వారీలో రోజుకు సుమారు 100 లారీలు లోడింగ్ అవుతున్నాయి. కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్‌గా ఏర్పడి ప్రతి లారీకి ఒక్కో బకెట్ అదనంగా వేసుకోవాలని నిబంధనలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి లారీకి అదనంగా బకెట్ వేస్తూ, ఒక్క రోజుకు అన్ని క్వారీలకు కలిసి సుమారు 20 లక్షల రూపాయలు, నెలకు 6 కోట్ల రూపాయలు కాగా, సంవత్సరానికి 72 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ.. వాటాల వారీగా పాలుపంచుకుంటున్నారు.

టీఎస్‌ఎం‌డీసీ ఎంప్లాయిస్ మొదలుకొని ఉన్నతాధికారుల వరకు, వార్డు మెంబర్ల నుంచి మొదలుకొని బడా లీడర్ల వరకు అక్రమంగా డబ్బులు పంచుకుంటున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం పరిధిలోని పూస్కుపల్లి పార్ట్ 2‌ క్వారీలో అయితే ఇందుకు రెండింతల దోపిడీ ఉంది. ప్రతి క్వారీలో ఒక అదనపు బకెట్ వేస్తే, ఈ క్వారీలో మాత్రం బాజాప్తుగా రెండు బకెట్లు వేస్తాం.. మమ్మల్ని అడిగే వారు ఎవరు అంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.

ఈ క్వారీలో రిటైర్డ్ పోలీస్ అధికారి పాట్నర్‌గా ఉన్నాడని అతని అండదండలతో రెండో అదనపు బకెట్ దందాకు తెర లేపారు. ఏకంగా క్వారీ వద్ద ఇద్దరు లోకల్ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి అక్రమ దందాను ప్రశ్నించిన వ్యక్తులపై దాడి చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. పోలీసు పవర్ అంటూ నిత్యం మనం వార్తల్లో వింటాం.. కానీ, ఆ అధికారి పోలీస్ పదవి నుండి రిటైర్ అయినప్పటికీ పవర్, పరపతిని ఉపయోగిస్తూ పూస్కుపల్లి పార్ట్ 2 క్వారీలో అదనంగా రెండు బకెట్లు వేయాలన్న సంకల్పంతో ఈ అక్రమ దందాను మూడు పువ్వులు ఆరు కాయలు అనే చందంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ దందా‌కు బ్రేక్ వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed