ఆదర్శంగా నిలుస్తున్న కోళ్లు అమ్మే అబ్బాయి

by Shyam |   ( Updated:2020-08-15 22:24:24.0  )
ఆదర్శంగా నిలుస్తున్న కోళ్లు అమ్మే అబ్బాయి
X

దిశ, కుత్బుల్లాపూర్: చదివేది బీటెక్.. చేసేది బిజినెస్. కరోనా కాలం ఆ యువకుడి ఆశలపై నీళ్లు చల్లింది. ఏమాత్రం అధైర్యపడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేశాడు. తల్లిదండ్రులు చేస్తున్న నాటు కోళ్ల వ్యాపారం వైపు మొగ్గుచూపాడు. బాగా చదువుకున్నానని గొప్పలకు పోకుండా చిరు వ్యాపారమైన చిరునవ్వుతో చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అమ్మ, నాన్నకు పనిలో అండగా నిలుస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సుబ్బయ్య, వరలక్ష్మి దంపతులు ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. కుత్బుల్లాపూర్​లో నివాసముంచూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు నవీన్ కుమార్ తోపాటు ఓ కుమార్తె ఉన్నారు. ప్రారంభంలో ప్రైవేట్ ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించేవారు. కాలక్రమేణా వచ్చే కొద్దిపాటి సంపాదనతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. దీంతో నాటు కోళ్ల వ్యాపారం చేయాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. జీడిమెట్ల ఆర్టీసీ డిపో సమీపంలో చిన్నగా నాటుకోళ్ల వ్యాపారం చేయడం ప్రారంభించారు.

ఒక పని మనిషిని పెట్టకుని వ్యాపారం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు బంద్ కావడంతో నవీన్ కుమార్ ఖాళీగా ఉంటున్నాడు. ఒకరోజు తల్లిదండ్రులతో కలిసి షాపునకు వెళ్లి వారి వ్యాపారాన్ని గమనించాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి వారికి తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. నవీన్ ​స్వయంగా కోళ్ల వ్యాపారం నిర్వహించడం మొదలు పెట్టాడు. నాటు కోళ్లతో పాటు కంజు పిట్టలు, బాతులను కూడా విక్రయిస్తున్నాడు. బీటెక్ చదివి కూడా కోళ్ల వ్యాపారంలో రాణిస్తూ అందరి చేత శభాష్​అనిపించుకుంటున్నాడు.

సంతోషంగా ఉంది : నవీన్ కుమార్, బీటెక్​ విద్యార్థి

మా కోసం అమ్మా, నాన్న ఎంతో కష్టపడుతున్నారు. కరోనాతో కాలేజీ బంద్​కావడంతో కోళ్ల వ్యాపారం స్వయంగా చేస్తున్నా. మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. చదువులోనూ మంచిగా రాణించి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతా. ఉన్నత స్థానానికి ఎదగాలన్నదే నా కోరిక.

Advertisement

Next Story

Most Viewed