భరోసా కేంద్రాల బలోపేతానికి చర్యలు : సీపీ అంజనీకుమార్

by Shyam |   ( Updated:2020-05-26 10:36:07.0  )
భరోసా కేంద్రాల బలోపేతానికి చర్యలు : సీపీ అంజనీకుమార్
X

దిశ, హైదరాబాద్: సమాజంలో సమానత్వం, సాధికారిత కోసం మహిళలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసేందుకు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మంగళవారం బషీర్ బాగ్ సీపీ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఉమెన్స్ ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇ-భరోసా, స్త్రీ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. ఇ-భరోసా ద్వారా బాధిత మహిళలు, బాలికలకు టెలీ-కౌన్సెలింగ్, వీడియో కౌన్సెలింగ్ అందించడమే కాకుండా, సమాజంలో భరోసా కేంద్రాలను అన్ని వర్గాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భరోసా ప్రధాన కేంద్రానికి అనుసంధానంగా ప్రతి జోన్‌లోనూ ఉప కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటి ద్వారా ఇ-కౌన్సెలింగ్ సులభతరం అవుతోందన్నారు. పోలీసులు మహిళా సాధికారిత దిశగా, సమాజాన్ని ఒకతాటి పైకి తీసుకొచ్చేందుకు పనిచేయాలన్నారు. కమ్యూనిటీ స్థాయిలో స్త్రీ సమూహాలు, ఎస్ హెచ్ఓ స్థాయిలో సబలా శక్తి సమూహాలుగా పెరుగుతాయని అన్నారు. ఈ సబలా శక్తి సమూహాలకు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మహిళా ఫోరం ఫీడ్ బ్యాక్‌ను అందించేలా ఉంటుందన్నారు. ఈ సమూహాలు సమర్థవంతంగా పనిచేయడానికి, మహిళల భద్రతను నిర్థారించడానికి ఏసీపీ, డీసీపీ, కమిషనర్ స్థాయిల్లో సమీక్ష ఉంటుందన్నారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ తరుణ్ జోషి, హెచ్సీఎస్సీ కన్వీనర్ భరణికుమార్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, అసోసియేట్ డైరెక్టర్ రాధాకృష్ణ, ప్రశాంతి, పూజిత నీలం, హెచ్డీఎస్సీ ఉమెన్స్ ఫోరం కన్వీనర్ వీజీ మృదుల, మహిళా ఫోరం సభ్యురాలు గీతా గోతి, రాజ్యలక్ష్మి, తరుష, లక్ష్మీమాధవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story