సరికొత్త విప్లవానికి తెరతీసిన ‘అగ్మెంటెడ్ రియాలిటీ’

by Shyam |
సరికొత్త విప్లవానికి తెరతీసిన ‘అగ్మెంటెడ్ రియాలిటీ’
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఓ కొత్త ప్రపంచాన్ని మన ముందుంచుతోంది. 3డీ, 4డీ దాటుకుని వర్చువల్ రియాలిటీ(వీఆర్), అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) ప్రపంచంలోకి వడివడిగా అడుగులు వేశాం. ఈ రెండింటి కలయికగా ‘మిక్డ్స్ రియాలిటీ’(ఎంఆర్) కూడా వచ్చేసింది. అయితే పాండమిక్ తర్వాత అన్ని రంగాల్లో ఏఆర్, వీఆర్ సేవలు కీలకంగా మారగా, లాక్‌డౌన్ తర్వాత తమ ప్రొడక్టివిటీ పెంచడానికి, కస్టమర్లను నిలుపుకోవడానికి, వ్యాపారాన్ని కొనసాగించడానికి వ్యాపారులు ఈ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. ఎన్నో బ్రాండ్స్ తమ కస్టమర్లను, అందులో ప్రధానంగా యంగర్ టెకీ కన్జ్యూమర్స్‌ను ఆకట్టుకోవడానికి బ్రాండ్ ప్రమోషన్స్‌లో, సేల్స్‌లో ఏఆర్ సాంకేతికతను వాడుకుంటున్నాయి. అంతేకాదు ఈ కొత్త టెక్నాలజీలు..ఏఆర్, వీఆర్ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ..సరికొత్త విప్లవానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

డిజిటిల్ ఎరాలో పల్లెల నుంచి పట్టణాల వరకు అందరూ ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటుపడ్డారు. కొవిడ్ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ మరింత పెరిగింది. కాగా, రిటీన్‌గా చేస్తున్న ఓ పని, అలవాటుగా మారడానికి 66 రోజులు పడుతుందని సైకాలాజిస్టులు చెబుతున్న మాట. ఆ లెక్కన 2020 నుంచి 2021 వరకు ఎంతోమంది తమ ఆరోగ్యం, రక్షణ దృష్ట్యా ఆన్‌లైన్ షాపింగ్‌కు కనెక్ట్ అయ్యారు. వచ్చిన కస్టమర్లను కోల్పోవడానికి ఏ వ్యాపారి సుముఖంగా ఉండడు. మార్కెటింగ్‌లో ప్రధానంగా కస్టమర్‌ రిలేషన్‌షిప్ కాపాడుకోవడం ప్రధానం కావడంతో వ్యాపారులు ఏఆర్, వీఆర్ టెక్నాలజీతో తమ కస్టమర్లకు మరింత చేరువ అవుతున్నారు. ఉదాహరణకు..ఐకియాలో సోఫాసెట్ కొనాలనుకుంటే, ఆ సంస్థ యాప్‌లో ఏఆర్ సాంకేతికత ఉపయోగించుకుని మన ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో ఆ సోఫా సెట్ అవుతుందా? లేదా? చెక్ చేసుకోవచ్చు. ఇదివరకు మాత్రం ఓ సోఫా కొంటే, ట్రాన్స్‌పోర్ట్‌లో దాన్ని ఇంటికి తీసుకెళ్లడం, తీరా ఇంటికి వెళ్లాక మనకున్న స్థలంలో ఫిట్ కాకపోవడంతో నానా ఇబ్బందులు పడేవాళ్లు. కానీ, ఇప్పుడా సమస్య లేదు. ఆ విధంగా ఏఆర్ టెక్నాలజీ కస్టమర్లకు ఎంతో ఉపయోగకరంగా మారింది.

ఐకియానే కాదు ఇండియన్ ఫ్యాషన్ లగ్జరీ హౌజ్ ‘గుస్సీ’ తమ వినియోగదారులకు వర్చువల్ సాంకేతికతను అందిస్తుండగా, ఇందులో భాగంగా మనం ఎంపిక చేసుకున్న షూ..వేసుకుంటే బాగుంటాయా లేదా ఏఆర్‌లో చూసి, డిసైడ్ చేసుకునే అవకాశం కస్టమర్‌కు ఉంటుంది. నైకీ కూడా ఇదే విధానాన్ని అందిస్తోంది. బ్యూటీ బ్రాండ్స్ లోరియల్, లూయిస్ వ్యూట్టన్, ప్రముఖ సంస్థలు ఆడి, వన్ ప్లస్‌‌తో పాటు ఇతర లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్ నైక్, వార్బీ పార్కర్, తమ కస్టమర్లకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాస్తవ ప్రపంచాన్ని, వర్చువల్ వరల్డ్‌ను అగ్మెంటెడ్ రియాలిటీ విడదీయలేనంతగా మార్చేయగా, బట్టలు, కాస్మెటిక్స్‌, చెప్పులు, షూ ఇతర ఫ్యాషన్ ఐటెమ్స్‌ వంటివి మనం కొనేముందే, అవి మనకు నప్పుతాయా లేదా చూసుకునే అవకాశం ఈ సాంకేతికలో మనకు అందుతోంది. దాంతో కస్టమర్లు ఈ టెక్నాలజీతో పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిపిన ఆన్‌లైన్ అధ్యయనంలో తమ షాపింగ్ ఎక్సీపీరియన్స్ కంప్లీట్‌గా ఏఆర్ మార్చేసిందని 68 శాతం మంది కన్జ్యూమర్లు తెలపగా, ఏఆర్ టెక్నాలజీ ఉంటేనే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తామని 61 శాతం మంది పేర్కొన్నారు.

మిక్స్‌డ్ రియాలిటీ విభాగంలో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, ప్రొడక్ట్‌లు రూపొందించే దిశగా దేశంలో పలు స్టార్టప్ సంస్థలూ ఏర్పాటవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం దేశంలో 150 వరకు వర్చువల్ రియాలిటీ స్టార్టప్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు మిక్స్‌డ్ రియాలిటీ విధానంలో పలు సంస్థలు తమ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నాయి. దాంతో ఏఆర్/వీఆర్ అసోసియేట్స్, ఇంజినీర్స్, ప్రోగ్రామర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. 2022 వరకు 1.9 బిలియన్ పీపుల్ ఏఆర్ టెక్నాలజీని ఉపయోగిస్తారని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల పరికరాలు ఏఆర్ సాంకేతికతో పనిచేస్తున్నాయని ఆన్‌లైన్ అధ్యయనంలో వెల్లడైంది. 2020 ప్రారంభం నుంచి ఏఆర్ వినియోగం దాదాపు 20 % వేగవంతం కాగా, 90 శాతం మంది వినియోగదారులు ఏఆర్‌తో ఎంగేజ్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో ఏఆర్ టెక్నాలజీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటం వల్ల యూత్ అటువైపున్న ఉద్యోగ అవకాశాల వైపు దృష్టి సారిస్తే మంచిది.

Advertisement

Next Story