అపోలో, బసవతారకం ఆస్పత్రులపై చర్యలెందుకు లేవు ?

by Anukaran |   ( Updated:2020-08-05 10:43:04.0  )
అపోలో, బసవతారకం ఆస్పత్రులపై చర్యలెందుకు లేవు ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అధిక బిల్లుల్ని చెల్లించకపోతే మృతదేహాన్ని కూడా అప్పగించడంలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ షరతులను ఉల్లంఘించిన ఆసుపత్రులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక చార్జీలను వసూలు చేయడంపై విశ్రాంత ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు బుధవారం పై వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రుల లైసెన్సులు రద్దుచేస్తే సరిపోదని, వాటికి కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది.

అపోలో, బసవతారకం ఆసుపత్రులు ప్రభుత్వ షరతులను ఉల్లంఘించాయని పిటిషనర్ పేర్కొన్నారు. కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతోనే ప్రభుత్వం రాయితీ ధరతో ఆసుపత్రులకు భూములను కేటాయించిందని పిటిషనర్ గుర్తుచేశారు. అపోలో, బసవతారకం ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని, ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నాయని వివరించారు. పిటిషనర్ లేవనెత్తిన వాదనలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది.

ప్రభుత్వం విధించిన షరతులను ఆ ఆసుపత్రులు ఉల్లంఘిస్తే వాటికి కేటాయించిన సర్కారు భూములను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించకపోతే మృతదేహాన్ని కూడా అప్పగించడంలేదని గుర్తుచేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేవలం ఆసుపత్రులకు జారీ చేసిన లైసెన్సులు రద్దుచేస్తే సరిపోదని, వాటికి కేటాయించిన భూముల్ని సైతం వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని అపోలో, బసవతారకం ఆసుపత్రులను హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed