రైతులకు పరిహారం చెల్లిస్తారా లేదా?

by Shyam |
రైతులకు పరిహారం చెల్లిస్తారా లేదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ కారణాలతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారాన్ని చెల్లిస్తారా లేదా, ఇప్పటికి ఎంతమందికి చెల్లించారో వివరాలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భారీ వర్షాలు, వరదలు, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలు, దానికిపరిహారంగా రైతులకు వివిధ బీమా పథకాల ద్వారా అందాల్సిన పరిహారం తదితరాలపై మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా ఆ నివేదికలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శంకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం విచారించిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.

అకాల వర్షాలతో రైతులకు పంట నష్టం జరిగిందని, వివిధ బీమా పథకాల కింద రైతులు ప్రీమియం రూపంలో డమ్బులు కట్టినా పరిహారం మాత్రం అందలేదని, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడంలేదని పిటిషనర్ శంకర్ తన పిటిషన్‌లో హైకోర్టుకు తెలియజేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ‘రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్’ పేర్లతో పలు బీమా పథకాలకు రైతులు ప్రీమియం రూపంలో డబ్బులు చెల్లించారని పిటిషనర్ గుర్తుచేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో పాటు బీమా సంస్థల అధికారులను కలిసి విన్నవించినా సానుకూల స్పందన రాకపోగా రైతులకు బీమా పరిహారం అందలేదని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం నుంచి హైకోర్టు వివరణ కోరింది. ఇప్పటివరకు ఎంత పంట నష్టం జరిగింది, ఎంత మంది రైతులకు ఆర్థికంగా నష్టం ఏర్పడింది. ఈ బీమా పథకాల పరిధిలోకి వచ్చేవారికి ఎంత మందికి పరిహారాన్ని బీమా సంస్థలు చెల్లించాయి, ఎంత మందిని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.. ఇలా అనేక వివరాలను మూడు వారాల్లోగా కోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story