- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కరోనా’పై పోలీసు గస్తీ
దిశ, నల్లగొండ: జిల్లాలో రోజురోజుకూ నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కేసులు పెరుగుతున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లోని ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ ప్రాంతాలను ప్రభుత్వం రెడ్‌జోన్‌లుగా ప్రకటించింది. పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. ఇతరులు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రహమత్‌బాగ్‌నగర్, మీర్‌బాగ్‌కాలనీ, బర్కత్‌పుర, మన్యంచెల్క, దామెరచర్ల, మిర్యాలగూడ పరిధిలోని సీతారాంపురం, సూర్యాపేట మున్సిపాలిటి, నాగరం మండలం వర్దమానుకోట, తిరుమలగిరి, నేరేడుచర్ల పరిసరాల్లో అధికారులు
నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు.
అన్ని మార్గాల మూసివేత..
ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఐదుగురికి నల్లగొండ పట్టణంలోని రహమత్‌బాగ్‌నగర్, మీర్‌బాగ్‌కాలనీ, బర్కత్‌పుర, మన్యంచెల్క ప్రాంతాలకు చెందిన వారికి కొవిడ్ 19 పాజిటివ్ రావడంతో ఈ పరిసర ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతాలకు వెళ్లే తొమ్మిది మార్గాలను మూసివేశారు. దామెరచర్లలో నానమ్మ నుంచి మనవరాలికి, మిర్యాలగూడలో మరో మహిళకు రావడంతో ఆ గ్రామాల సరిహద్దులను దిగ్బంధనం చేశారు. పాజిటివ్ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి ఎవరినీ బయటకు అనుమతించడం లేదు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరంతరం పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రజలూ ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ వీధులు, సందుల్లోకి వచ్చే దారులను మూసివేశారు. ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు నిత్యావసర సరుకులు, కాయగూరలను ఇళ్ల వద్దకే పంపిస్తున్నారు. రోజూ హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో 4 ప్రత్యేక వైద్యబృందాలు పర్యటించి ఆరోగ్య వివరాలు సేకరించాయి. ఈ ప్రాంత రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 24 గంటలు పోలీసు పహారా ఏర్పాటు చేయడంతోపాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
పలుచోట్ల పేదలకు ఆహారాన్ని అందించేందుకు యువకులు, వివిధ సంఘాలు కృషి చేస్తున్నాయి. నిర్బంధంలో 9126 మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో తొలుత 5 కేసులు నిర్ధారణ కావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెడ్ జోన్ ప్రాంతాల్లోని కిలోమీటర్ పరిధి వరకు ఆంక్షలు విధించారు. సుమారు 200 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆరోగ్య సిబ్బందిని రంగంలోకి దించి సుమారు 3,276 ఇండ్లల్లో ఉంటున్న 9126 మందికి స్క్రీనింగ్ చేసి హోం క్వారంటైన్ చేశారు.16 పాజిటివ్ కేసులు నమోదైన నల్లగొండలో జిల్లాలో ఆరు రోజులుగా ఒక్క కేసు వెలుగు చూడకపోవడం అధికారులు తీసుకుంటున్న
ముందస్తు జాగ్రత్తల చర్యల ఫలితమేనని పలువరు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు 204 మంది అనుమానితుల నుంచి రక్త శాంపిల్స్ పంపించగా ఇప్పటి వరకు అందిన రిపోర్టుల్లో 16 మినహా మిగతావన్ని నెగెటివ్ రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మహాత్మాగాంధి యూనివర్సిటీ, నల్లగొండ, మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న 389 మందిలో సగం మందిని డిశ్చార్జీ చేశారు. మిగిలిన వారికీ లక్షణాలు లేనప్పటికీ రెండో సారి రక్త శాంపిల్స్ సేకరించి రిపోర్టులు వచ్చిన తర్వాత వారిని డిశ్చార్జీ చేస్తామని వైద్య అధికారి కొండల్‌రావు చెబుతున్నారు.
ఎస్పీ రంగనాథ్ భరోసా
నల్లగొండ పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో నల్లగొండ ఎస్పీ రంగనాథ్ ఆదివారం పర్యటించారు. కరోనా పాజిటివ్ వచ్చి డిశ్చార్జీ అయినటువంటి వారి ఇండ్లకు వెళ్లి పేర్లు పెట్టి పిలిచి పలకరిచారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. అలాగే వారి కుటుంబీకుల ఆరోగ్య స్థితిగతుల గురించి వాకబు చేశారు. రోజువారీగా జరుగుతున్న డోర్ డెలివరీ వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తోన్న పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్కడి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి తగిన రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతాల్లో అత్యవసర సేవలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను విస్మరించరాదని గుర్తు చేశారు. అత్యవసర సమయంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని అక్కడి ప్రజలకు భరోసా కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా జిల్లా పోలీస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా తనకు వాట్సాప్ చేస్తే సరిపోతుందని తెలిపారు. సుమారు 4 గంటల పాటు ఎస్పీ రంగనాథ్ కొవిడ్ 19 పాజిటివ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మమేకమై వారిలో దైర్యం నింపారు.
Tags: high alert, red zone, covid 19 lockdown, police, lockdown