అరేబియాలో అల్పపీడనం..తెలంగాణకు భారీ వర్ష సూచన

by Shyam |
అరేబియాలో అల్పపీడనం..తెలంగాణకు భారీ వర్ష సూచన
X

దిశ, న్యూస్‌బ్యూరో:
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఆదివారం భారీగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షపాతం కురవడంతో పాటు హైదరాబాద్‌లో రోడ్లు జలమయమయ్యాయి.ముందుగా వచ్చిన వర్షాలతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో హడలెత్తించిన ఎండలతో ఉక్కిరిబిక్కిరయిన నగర వాసులు కొంత కూల్ అయ్యారు.ఈ నెల 31న ఉదయం ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌గా మారి ఉత్తర దిశగా మరలుతోందని రాగల 24 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నాయి. చత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవుల వరకు, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో రాగల మూడ్రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకూ అందిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం మంచిర్యాల్ జిల్లాలోని జైపూర్ మండలంలో 10.6 సెంటీమీటర్లు నమోదైంది. పెద్దపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.పెద్దపల్లిలో 7.2సెం.మీ, సంగారెడ్డిలోలో 7సెం.మీ, రామగుండంలో 6.8సెం.మీ, ఆరుట్లలో 5.7సెం.మీ, సిద్ధిపేటలో 4.7సెం.మీ, దుండిగల్‌లో 4.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

తడిసిన భాగ్యనగరం

ఈ నెల 16న గరిష్టంగా 5 సెంటీమీటర్ల వర్షం కురవగా ఆ రికార్డు నేటితో చెదరిపోయింది. ఆదివారం సాయంత్రం పటాన్‌చెరులో 7 సెం.మీ, హయత్‌నగర్‌లో 6.6 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం, ఎల్‌బీనగర్, కూకట్ పల్లి సర్కిల్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వెదర్ రిపోర్టు తెలిపింది. పటాన్‌చెరులో 7 సెం.మీ, కూకట్‌పల్లిలో 5.6 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 4సెం.మీ, కుత్భుల్లాపూర్‌, శేరిలింగంపల్లిలో 3సెం.మీ, సైదాబాద్, హిమాయత్ నగర్‌లో 2.6సెం.మీ, శేక్‌పేట, ఖైరతాబాద్‌ల్లో 2.2 సెంమీ, ఉప్పల్‌లో 2 సెం.మీల వర్షపాత నమోదైంది. కొత్తపేట, మలక్‌పేట, సరూర్ నగర్, చంపాపేట, అంబర్ పేట, కీసర, దమ్మాయిగూడ, జవహర్ నగర్ ఏరియాల్లో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ వర్షాల వలన ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు 267 మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉన్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. కేబీఆర్ పార్కు వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను మేయర్ పరిశీలించారు. మాన్‌సూన్‌ టీంలతో పాటు 16 డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహయక చర్యలు అందించేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు.

రోడ్లన్నీ జలమయం – నేతల పిలుపులేమైనట్టు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గరిష్టంగా కురిసిన వర్షపాతం 7సెంమీలుగా కాగా.. రాష్ట్రంలో 10సెంమీల పైనా కురిసింది. దీనికే ఇలా ఉంటే రానున్న రోజుల్లో వర్ష బీభత్సం పెరిగితే ఎలాంటి అవస్థలు పడాల్సి వస్తుందోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. బంజరాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మియాపూర్, ఎల్‌బీనగర్, ఎర్రమంజిల్, రాజ్‌భవన్ రోడ్ సికింద్రాబాద్ రోడ్లపై మూడు అడుగుల వరద నీరు ప్రవహించింది. టూ వీలర్లు, ఫోర్ వీలర్స్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజ్‌భవన్ రోడ్డులో వరద నీటి ఉధృతికి బారీకేడ్లు కొట్టుకునిపోయాయి. వాహనాల్లోకి నీరు చేరి ఆగిపోవడంతో వాహనదారులకు అవస్థలు తప్పలేదు. గ్రేటర్ రోడ్లపై వర్షపు నీరు చేరకుండా అన్ని చర్యలు చేపట్టామని ప్రభుత్వ నేతలు చెప్పుకుంటున్న మాటలు డొల్లేనని ఈ వర్షం నిరూపించింది. వర్షపు నీరును సరిగా ప్రవహించేలా చేసే వ్యవస్థ లేకపోవడంతో గంటల తరపడి రోడ్లపైనే వరదనీరు నిలిచింది. పలు చోట్ల విద్యుత్, కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు దెబ్బతిన్నాయి. ఐటీ సహా పలు కంపెనీలు, ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండటంతో వారందరికీ ఇబ్బందులు ఏర్పడ్డాయి. వర్షపు నీరు నిల్వ ఉంటే సీజనల్ వ్యాధులు వస్తాయని ఓ వైపు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరో వైపు రోడ్లపై నిలిచిన వర్షపు నీరు, డ్రైనేజీ కలిసిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రగతి ప్రణాళికలతో రూపురేఖలు మారిపోతాయని పురపాలక శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. ఐటీ ఉత్పుత్తులకు దేశంలోనే తలమాణికంగా ఉందని చెప్పే సిటీలో సాధారణ వర్షపాతం కురిస్తే రోడ్లపై సముద్రం కనిపిస్తోంది. ఇక భారీ వానలు కురిస్తే చేతులెత్తేయక తప్పదని సోషల్ మీడియాలో అధికార నేతలపై సెటైర్ల వర్షం కురుస్తోంది.

Advertisement

Next Story