జూరాలలో భారీగా చేపలు

by Anukaran |
జూరాలలో భారీగా చేపలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు ప్రజలు ప్రాజెక్టుల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో జూరాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. శ్రావణం ముగియడంతో చేపలకు డిమాండ్ ఏర్పడింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పర్యాటకులు సామాజిక దూరాన్ని పాటించడం లేదు. స్వీయ రక్షణను లెక్క చేయకుండా తిరుగుతున్నారు. మరో వైపు రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని జూరాల, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు నిండాయి. దీంతో అధికారులు ఇప్పటికే గేట్లు ఎత్తారు. జూరాలకు పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో సోమవారం సైతం 20 గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు 2గేట్ల ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. వీటిని చూసేందుకు పర్యటకులు ప్రాజెక్టుల వద్దకు భారీగా చేరుకుంటున్నారు.

వర్షం తగ్గడంతో పెరిగిన సందడి

సుమారు వారం రోజులుగా జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. గత నాలుగు రోజులుగా వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా జనాలు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల వద్దకు చేరుకుంటుండడంతో అక్కడి రహదారులు వాహనాలతో నిండిపోయాయి. జూరాల వద్ద ఆదివారం రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందంటే పర్యటకుల తాకిడి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

చేపలకు గిరాకీ

మొన్నటి వరకు శ్రావణ మాసం ఉండడంతో జూరాల గేట్లు తెరిచిన పెద్దగా పర్యాటకుల తాకిడి కనిపించలేదు. కానీ శ్రావణ మాసం ముగియడంతో చేపల ప్రియులు జూరాల వైపు పరుగులు తీస్తున్నారు. జూరాలకు వరదలు వచ్చిన సమయంలో ఇక్కడ చేపలు పెద్ద ఎత్తున దొరుకుతుంటాయి. ఈ సందర్భంలో నాలుగైదు రోజులుగా జూరాల వద్ద పర్యాటకులు చేపల కోసం వస్తున్నారు. దీంతో అక్కడ చేపల వ్యాపారం జోరందుకుంది.

నిబంధనలు గాలికి

జూరాల ప్రాజెక్టును చూసేందుకు వస్తున్న సందర్శకులు కొవిడ్ నిబంధనలకు పాటించడం లేదు. ముఖ్యంగా సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఇష్టానుసారంగా షాపులు ఏర్పాటు చేయడంతో అక్కడే చాలామంది చేపల వంటకాల కోసం బారులు తీరుతున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో చాలా మంది యువకులు నది వద్దకు చేరుకుంటున్నారు. స్నానాలు చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు నది పరివాహక ప్రాంతాల్లోకి వెళుతున్నారు. ఆదివారం ఓ యువకుడు నదిలో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. నది వద్ద రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ దిశగా ఆలోచిండం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సుదర్శన్, సామాజిక కార్యకర్త

ఏడాది క్రితం‌ జూరాల 62 గేట్లు తెరిచినప్పుడు‌ భారీగా ప్రజలు వచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడా పర్యాటక కేంద్రాలు లేకపోవడంతో జూరాల, బీచుపల్లి వద్ద ఉన్న నిజాంకోటను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. కుటుంబ సమేతంగా జూరాలను చూడటానికి‌ వచ్చే వారికి రవాణా సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.

Advertisement

Next Story

Most Viewed