రైతుబంధుకు మరో చాన్స్​

by Anukaran |
రైతుబంధుకు మరో చాన్స్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : యాంసగి రైతుబంధు పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదు అయిన రైతుల జాబితా సీసీఎల్‌ఏ ద్వారా రైతుబంధు పోర్టల్‌లోకి చేర్చారు. గతంలో రానివారు, వివరాలు సరిగా లేని రైతులకు మరో అవకాశం కల్పించారు. వారంతా ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రైతుబంధు దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాస్ బుక్‌, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను ఏఈవోలకు అందజేయాలని పేర్కొంది. మార్గదర్శకాలలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ముందుగా ఐదెకరాలలోపు విస్తీర్ణం ఉన్న రైతులకు సాయాన్ని విడుదల చేయనున్నారు. గత ఏడాది యాసింగిలో 18.45 లక్షల మంది రైతులకు సాయం అందించలేదు. బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం, ఆధార్​ సమస్యలతో రైతుబంధుకు దూరమయ్యారు. వానాకాలంలో 57 లక్షల మంది రైతులకు రైతుబంధు సొమ్ము విడుదల చేయగా, దాదాపు 4.20 లక్షల మంది ఖాతాలలో జమ కాలేదు. ఈసారి కూడా ఆధార్​, ఖాతా వివరాలు సరిగా లేకపోవడంతో సొమ్ము బ్యాంకుల్లోనే మూలుగుతోంది. ఈసారి ధరణి పోర్టల్​తో అనుసంధానించారు. 3.81 లక్షల మంది రైతుల వివరాలు ధరిణిలో సరితూగడం లేదు. వారికి రైతుబంధు వచ్చే పరిస్థితి లేదు. వీరి కోసమే ప్రభుత్వం ఈ నెల 20 వరకు అవకాశం కల్పిస్తోంది. కొన్ని జిల్లాలలో ఈ నెల 19 వరకే అవకాశం కల్పించారు.

Advertisement

Next Story