వైద్య కళాశాల అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్

by Shyam |
వైద్య కళాశాల అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సిద్దిపేటలోని సురభి ప్రైవేటు మెడికల్ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో వంద సీట్లకు అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడానికి అనుమతి మంజూరైంది. ఈ కళాశాల గతేడాది ప్రారంభంకాగా ఎలాంటి ఆటంకాలు లేకుండా అడ్మిషన్లు పూర్తయ్యాయి. కానీ ఈ సంవత్సరం రెన్యూవల్ సమయంలో కళాశాలలో తగిన సౌకర్యాలు లేవన్న కారణంగా రెన్యూవల్ చేయడానికి, కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడానికి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి నిరాకరించింది. దీంతో కళాశాల యాజమాన్యం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఇటీవల వెలువడిన తీర్పుతో కొత్త సంవత్సరం మొదటి రోజునే రెన్యూవల్ లభించింది. దీంతో వంద మంది విద్యార్థులకు అడ్మిషన్ పొందడానికి మార్గం ఏర్పడింది.

ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సులో 4940 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కళాశాలకు వంద సీట్లకు అనుమతి రావడంతో అదనంగా సమకూరినట్లయింది. ఈ వంద సీట్లలో యాభై కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతాయి. వివిధ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద చేరి మధ్యలోనే వదిలేసిన సీట్లు దాదాపు పాతిక ఉన్నాయి. ఈ రెండింటికీ కలిపి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 15వ తేదీ వరకు అడ్మిషన్లను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ ప్రక్రియ డిసెంబరు 31కే పూర్తయినప్పటికీ కోర్టు ఆదేశం మేరకు జనవరి 1వ తేదీన ఈ కళాశాలకు రెన్యూవల్ అనుమతి రావడంతో పదిహేను రోజుల పాటు కౌన్సెలింగ్ చేసుకోడానికి ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది విశ్వవిద్యాలయం.

Advertisement

Next Story