సహనశీల సమాజ నిర్మాణమే కలాంకు నివాళి

by Shyam |
సహనశీల సమాజ నిర్మాణమే కలాంకు నివాళి
X

దిశ, న్యూస్​బ్యూరో: సహనశీలమైన, సుందర సమాజ నిర్మాణమే మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాంకు మనమిచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కలాం ఐదో వర్థంతి సందర్భంగా సోమవారం ఏపీజే కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్​లో గవర్నర్​ రాజ్‌భవన్ నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కలాం దృష్టిలో ఎక్కడైతే ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారో, ఇతరుల ఆచార, వ్యవహారాలను, సంస్కృతిని, వేషభాషలను గౌరవిస్తారో అదే సుందరమైన సమాజమని వివరించారు. శ్రమను, కృషిని ఎంతో గౌరవించేవారని, కష్టించి పని చేయడాన్ని ఎంతగానో అభిమానించేవారని ఓ సంఘటనను వివరించారు. భారత రాష్ట్రపతిగా, మిస్సైల్ సైంటిస్ట్​గా, ఆవిష్కర్తగా, రచయితగా కాకుండా తనను ఒక టీచర్​గా గుర్తుంచుకోవాలని కలాం చెప్పేవారని తెలిపారు. ఆయన రెండోసారి రాష్ట్రపతి కాకపోవడం భారత దేశానికి, ఈ దేశ యువతకు తీరని అన్యాయమని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు నజీమా మరైకర్, ఏపీఎంజె షేక్ దావూద్, ఎపిఎంజె షేక్ సలీమ్, పద్మశ్రీ కార్తికేయ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed