ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు

by Aamani |
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలే ఇందులో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు కావడం, ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండడం వారి పాలిటవరంగా మారింది. బెల్లంపల్లి పట్టణంలోని సర్వే నెంబర్ 170లో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూములను అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నానాటికి అంతరించిపోతున్నాయి.

ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం.. అఖిల పక్ష నాయకుడు జయరామ్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ కబ్జాలు ఆగడం లేదు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడం పట్ల పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి ఎదురుగా ఉన్న టకారియా నగర్‌లో అక్రమంగా కట్టడాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నా.. మున్సిపల్ సిబ్బంది మరియు రెవిన్యూ సిబ్బంది సంబంధిత ప్రదేశాలను పరిశీలించక పోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టిసారించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed