కళ్లాల్లో సోయా… కన్నెత్తి చూడని మార్క్‌‌ఫెడ్

by Anukaran |
కళ్లాల్లో సోయా… కన్నెత్తి చూడని మార్క్‌‌ఫెడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాలం కలిసి రావడంతో ఉత్సాహంగా పంటలు వేసిన రైతులకు కొనుగోళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతిసారిలాగే ఈసారి కూడా సోయా పంట కొనుగోలు చేయడంపై ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులకు తిప్పలు మొదలయ్యాయి. వానాకాలం తొలి పంట సోయా పంట చేతికి వచ్చినా ప్రభుత్వం కొనేందుకు ఎలాంటి ప్రణాళిక చేయలేదు. వరిధాన్యాన్ని ప్రతి గింజనూ కొంటామని ప్రకటించిన ప్రభుత్వం మిగతా పంటల కొనుగోళ్లపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. దీంతో ఓ వైపు సన్నాల దిగులు పట్టుకోగా ఇప్పుడు చేతికి అంది వచ్చిన సోయా రంది పట్టుకుంది. కళ్లాల్లోనే సోయా ఉత్పత్తులు పేరుకుపోయాయి. సోయా చేతికి వచ్చి పది రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా దళారులు రాబందుల్లా వాలుతున్నారు. స్థానికంగా వ్యాపారులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అగ్గువకు కొంటున్నారు. ఓవైపు పండగలు వస్తుండటంతో రైతులు అత్యవసరాల పేరిట వచ్చిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ముందు నుంచీ సోయా రైతుల కష్టాలు

పంటల సాగు సమయంలోనే నకిలీ సోయాబీన్ విత్తనాలను రైతులకు అంటగట్టడంతో లక్షకుపైగా ఎకరాల్లో మొలకెత్తలేదు. నిర్మల్ జిల్లాలో 36,367 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 2961 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 1382 ఎకరాలు, సంగారెడ్డిలో 300 ఎకరాలు, కామారెడ్డిలో 400 ఎకరాల్లో సోయా విత్తనాలు మొలకెత్తలేదని జూలై నెలలో ప్రాథమిక విచారణ నివేదికను ఇచ్చారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో లక్షా 10 వేల ఎకరాల్లో సోయా విత్తనాలు మొలకలు రాలేదు. ముందుగా 41,410 ఎకరాల్లో ప్రాథమికంగానే గుర్తించారు. ఆ తర్వాత లక్షా పదివేల ఎకరాల్లో మొలకలు రాలేదని రైతు సంఘాలు నివేదించాయి. వాటికి రైతులకు పరిహారం అందించలేదు. ఇలా ఈసారి ముందే రైతులకు దెబ్బ తగిలింది.

కొనుగోళ్లా.. మాకేం తెల్వదు

రాష్ట్రంలో ఈసారి పంటల సాగు గణనీయంగా పెరిగింది. సోయా సాగు కూడా 3.95 లక్షల ఎకరాలు సాగైంది. దీంతో దిగుబడి 3.42 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేశారు. అనుకున్న సమయానికే పంట చేతికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొనుగోలు మొదలు కావాల్సి ఉండగా.. ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. అసలు కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తడం లేదు. పంట నూర్పిడి చేసి కళ్లాల వద్ద ఆరబెట్టారు. కానీ ప్రస్తుతం వర్షాలు అదును దాటి కూడా కురుస్తుండటంతో రైతులను భయం వెంటాడుతోంది. సోయాకు గత ఏడాది రూ.3,170 మద్దతు ధర ఉండగా ఈసారి మాత్రం రూ.3,880గా ఉంది. సోయా కొనుగోళ్లపై ఇంకా నిర్ణయాలు తీసుకోవడం లేదు. సహకార సంఘాలతో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఇప్పటికే పంట చేతికి వచ్చి పక్షం రోజులు దాటింది.

పత్తి నిల్వలతోనే ప్రమాదం

వాస్తవంగా సోయా పంట చేతికి వచ్చే ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి సోయా కొనుగోలు చేస్తే నిల్వ చేసే గోదాములు లేవు. అవన్నీ పత్తి నిల్వలతోనే పేరుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గోదాముల్లో పత్తి నిల్వలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లపై ఆదేశాలిచ్చిన ప్రభుత్వం సోయా పంట కొనడంపై ఆదేశాలివ్వలేదు. మార్క్‌ఫెడ్ అధికారులు సోయా కొనుగోళ్లపై మాకేం ఆదేశాలు రాలేదని, మాకేం తెల్వదంటూ తెగేసి చెబుతున్నారు.

అదును చూసి అగ్గువకు

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో ఆయా జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల దళారులు కూడా పంటలపై రాబందుల్లా వాలుతున్నారు. రైతుల అవసరాలు, వాతావరణ పరిస్థితులను సాకుగా చూపించి, భయపెడుతూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. చెప్పిన ధరకే అమ్మాలని, లేకుంటే వచ్చిన దిగుబడి నాశనం అవుతుందంటూ భయపెడుతున్నారు. ఓ వైపు పండగ ఖర్చులు, అప్పులకు తోడుగా కొనుగోలు కేంద్రాలపై స్పష్టత లేకపోవడంతో రైతులు కూడా దళారుల వలలో పడుతున్నారు. ఇదే అదును చూసి దళారులు రూ.3300 నుంచి రూ.3500 వరకే కొంటున్నారు. మరికొన్ని చోట్ల రూ. 3 వేలకు అమ్ముతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ దళారులు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed