పాత బకాయిల సంగతేంటీ.. ఉద్యోగుల్లో నిరాశ

by Shyam |   ( Updated:2021-03-22 03:04:39.0  )
పాత బకాయిల సంగతేంటీ.. ఉద్యోగుల్లో నిరాశ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులు 21 నెలల ఆర్థిక నష్టాన్ని చూస్తున్నారు. సీఎం కేసీఆర్​ సోమవారం పీఆర్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్​ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. దానికంటే ముందుగా 12 నెలల పీఆర్సీ బకాయిలను సైతం చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ బకాయిలను మాత్రం పదవీ విరమణ బెనిఫిట్స్​లో జమ చేయనున్నారు. అంటే గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు బకాయిలు ఉద్యోగులకు ఇప్పుడు రావు. ఈ ఏడాది ఏప్రిల్​ 1 నుంచి మాత్రం నగదు రూపంలో వేతనాల్లో జమ కానున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగులు 21 నెలల వేతన బకాయిలను నష్టపోతున్నారు. గతంలో ఏడాది, ఏడాదిన్నర ఒకసారి నష్టపోగా… ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో మొదటి పీఆర్సీలోనే 21 నెలల నష్టాన్ని అందుకుంటున్నారు.

21 నెలల నోషనల్​

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018, జూలై 1 నుంచి పీఆర్సీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం త్రిసభ్య కమిషన్​ను నియమించింది. ఒకే సభ్యుడితో కమిషన్​ ఉంటే ఆలస్యమవుతుందని ప్రకటించిన సీఎం కేసీఆర్​… ముగ్గురుసభ్యులతో మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. కానీ కాలయపాన యథాతథంగానే జరిగింది. గతంలో లేని విధంగా ఈ కమిషన్​ ఏకంగా 32 నెలల సమయం తీసుకుంది. కాగా ఉద్యోగుల లాస్​ కూడా ఈసారి ఎక్కువగా జరిగింది. 2018 జూలై నుంచి 11వ పీఆర్సీ అమల్లో ఉండాల్సి ఉండగా… దాదాపు 21 నెలలు నోషనల్​గా గుర్తించాల్సి వస్తుంది. అంటే 2018 జూలై నుంచి 2020, మార్చి వరకు ఎలాంటి బెనిఫిట్స్​ వర్తింపచేయడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో 21 నెలల పాటు వేతన సవరణను ఉద్యోగులు కోల్పోయారు.

12 నెలల బెనిఫిట్స్​

గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ప్రకటించిన పీఆర్సీ వర్తింపచేయనున్నారు. దీని ప్రకారం 12 నెలల బకాయిలను రిటైర్మెంట్​ బెనిఫిట్స్​లో జమ చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. అంటే ఈ 12 నెలల బకాయిలను ఉద్యోగులు ఇప్పుడు అందుకోలేరు. పదవీ విరమణ సందర్భంగా చేతికందనున్నాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్​ నుంచే నగదు రూపంలో ఉద్యోగుల వేతనాల్లో రానున్నాయి. పెరిగిన ఫిట్​మెంట్​ 30 శాతం కలుపుకుని మే నెలలో ఉద్యోగులు వేతనాలు తీసుకోనున్నారు.

గతంలో తక్కువే..

తెలంగాణ తొలి ప్రభుత్వంలో 11వ పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోవాల్సి వస్తోంది. పీఆర్సీ నివేదికల్లో వెల్లడించిన వివరాల ప్రకారం 1958వ ఏడాది, 1965 ఏడాది మినహాయిస్తే… 1974లో 11 నెలలు నష్టపోయారు. 1974 జనవరి 1 నుంచి ఫిట్​మెంట్​ అమలుకావాల్సి ఉండగా… 1975 జనవరి 1 నుంచి వర్తింపచేశారు. ఆ తర్వాత 1978లో 19 నెలల నష్టాన్ని చూశారు. 1986 పీఆర్సీలో 14 నెలలు, 1993లో 23 నెలలు నష్టపోయారు. 1999 పీఆర్​సీలో 17 నెలలు, 2005 పీఆర్సీలో 16 నెలలు, 2008 పీఆర్సీలో 16 నెలలు, 2014 పీఆర్సీలో 14 నెలల నష్టాన్ని ఉద్యోగులు ఎదుర్కొన్నారు. కానీ ఈసారి మాత్రం 21 నెలల నష్టాన్ని భరించాల్సి వస్తోంది.

Advertisement

Next Story

Most Viewed