యానిమేషన్ గేమ్స్‌తో ఒలింపిక్స్ డూడుల్ రూపొందించిన గూగుల్

by Shyam |   ( Updated:2021-07-23 02:19:31.0  )
యానిమేషన్ గేమ్స్‌తో ఒలింపిక్స్ డూడుల్ రూపొందించిన గూగుల్
X

దిశ, ఫీచర్స్ : సమస్త క్రీడాకారులు ఒక్కచోట చేరే అత్యద్భుత వేదిక ‘ఒలింపిక్స్’. బోలెడన్నీ ఆటలు, వందలాది క్రీడాకారులు, అచ్చెరువొందించే విన్యాసానికి రంగం సిద్ధమైంది. జపాన్ రాజధాని టోక్యోలో 2021 విశ్వక్రీడా సంబరాలు ఈరోజు(జూలై 23-శుక్రవారం) మొదలవుతుండటంతో గూగుల్ ప్రత్యేక డూడుల్‌‌ను రూపొందించింది.

గూగుల్ అనేక రకాల క్రీడలను ప్రతిబింబించే ఆటలతో డూడుల్ అందించింది. ఇందులో ‘లక్కీ క్యాట్’ లేదా ఆసియా ప్రసిద్ధ బొమ్మ ‘మానేకి-నెకో’ను కూడా చేర్చడం విశేషం. అంతేకాదు ఒలింపిక్స్ సందర్భంగా గూగుల్ వచ్చే రెండు వారాల పాటు ఇంటరాక్టివ్ సిరీస్ డూడుల్ గేమ్స్‌ను ప్రారంభిస్తోంది. దీనిని ‘డూడుల్ చాంపియన్ ఐలాండ్ గేమ్స్’ అని పిలుస్తారు. జపనీస్ యానిమేషన్ స్టూడియో ‘4 డిగ్రీ సెంటిగ్రేడ్’ ఈ ఏడు మినీ యానిమేషన్ గేమ్స్ డిజైన్ అందించింది. ఇందులో రగ్బీ, టేబుల్ టెన్నిస్, స్కేట్ బోర్డింగ్, విలువిద్య, సింక్రొనైజ్డ్ స్విమ్మింగ్, రాక్ క్లైంబింగ్, మారథాన్‌ వంటి గేమ్స్ ఉండగా, లక్కీ క్యాట్ ఆయా క్రీడల్లోని ప్రతి క్రీడా చాంపియన్‌ను ఓడించి చాంపియన్‌షిప్ గెలుచుకోవాలి. క్రీడా చాంపియన్స్‌ పాత్రలను జపాన్ జానపద కథలు, మస్కట్‌ల ఆధారంగా డిజైన్ చేశారు. జట్టు చిహ్నాలు ఉత్తరాన ఉన్న హక్కైడో ద్వీపం నుంచి దక్షిణాన ఒకినావా ద్వీపం వరకు జానపద కథలకు నివాళులర్పించాయి.

Advertisement

Next Story

Most Viewed