గోద్రేజ్ ప్రాపర్టీస్ నికర నష్టం రూ. 20 కోట్లు

by Harish |
గోద్రేజ్ ప్రాపర్టీస్ నికర నష్టం రూ. 20 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: గోద్రేజ్ గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ విభాగం గోద్రేజ్ ప్రాపర్టీస్ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 20 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 90 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 76.7 శాతం క్షీణించి రూ. 165 కోట్లకు చేరుకుంది. అలాగే, నిర్వహణ లాభం గతేడాది రూ. 195 కోట్లు ఉండగా, ఈ సారి రూ. 40 కోట్లకు పడిపోయిందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ త్రైమాసికంలో సుధీర్ఘకాలం పాటు లాక్‌డౌన్ ఉన్నందున నిర్మాణ కార్యకలాపాలు పరిమితం అయ్యాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అంతేకాకుండా, తొలి త్రైమాసికంలో బలమైన అమ్మకాలు సాధించేందుకు కంపెనీ డిజిటల్ అమ్మకాలపై ఆధారపడిందని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజా గోద్రేజ్ అన్నారు. ఇక, ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 2.51 మిలియన్ చదరపు అడుగుల బుకింగ్‌లతో, దీని విలువ రూ. 1,531 కోట్లకు పెరిగినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

గతేడాది ఇదే త్రైమాసికంలో బుకింగ్ విలువ రూ. 897 కోట్లతో 1.35 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం..లాక్‌డౌన్ సమయంలో ఆగిపోయిన దాదాపు అన్ని సైట్లలో నిర్మాణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని, జులై చివరి నాటికి కరోనాకు ముందున్న స్థాయిలో 60 శాతం పునరుద్ధరిస్తామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed