- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గీత’ దాటి పాతికేళ్లు!
అవును.. ఆ బాలిక.. ఇప్పుడు యువతి..! పుట్టుకతో మూగ, చెవుడు..! ఎప్పుడో పాతికేళ్ల క్రితం దారి తప్పి రైలెక్కి పాకిస్తాన్‌కు వెళ్ళింది. అక్కడి లాహోర్ రైల్వేస్టేషన్లో దిగింది. సరిగ్గా ఐదారేళ్లు ఉంటాయి కాబోలు. ఏడుస్తూ ఉంటే అక్కడి మానవతావాదులు చేరదీశారు. ఎన్నిసార్లు పలకరించినా నోట మాట రాకపోవడంతో మూగ అమ్మాయిగా అక్కడి పోలీసులు గుర్తించారు. సైగలతో చెప్పిన భాషతో ఆ అమ్మాయి ఇండియా వాసిగా గుర్తించారు. ఆమెకు ‘గీత’ అని పేరు పెట్టారు. ఇదంతా సినిమా స్టోరీలా ఉన్నప్పటికీ నిజం అదే. గీత సొంతూరు ఎక్కడో.. ఆమె కుటుంబం ఎవరో తెలియని పరిస్థితి. పదిహేనేళ్లకు పైగా పాకిస్తాన్‌లోనే ఉండిపోయింది. అక్కడి ‘ఈద్’ అనే స్వచ్ఛంద సంస్థ గీత సంరక్షణ బాధ్యతలను చూసింది. ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహకారంతో గీత భారత్ చేరింది.
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆరేండ్ల క్రితం ఢిల్లీ చేరిన గీతను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చేయని ప్రయత్నం లేదు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆనంద్ ఫౌండేషన్ గీత సంరక్షణ బాధ్యతలను తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గీతను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బ్రెయిలీ లిపి నిపుణులను వెంటబెట్టుకుని గీత చెబుతున్న వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అటు ఇటుగా ఆరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటిదాకా గీత కుటుంబ సభ్యుల వివరాలను రాబట్టలేకపోయారు.
బాసరకు చేర్చిన మూగ భాష
గీత తన మూగ భాషతో తన స్వస్థలం బాసర ప్రాంతాన్ని పోలి ఉంటుందని చెప్పుకొచ్చింది. నదీ తీరంతోపాటు పెద్ద గుడి, రైల్వే స్టేషన్ ఉంటుందని చెప్పింది. చిన్నప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో తన తల్లిదండ్రులతో తిరుగుతూ ఇడ్లీ తినేదాన్నని చెప్పింది. రైల్వేస్టేషన్ ఉండడంతో గీత చెప్పిన సమాచారం వాస్తవం కావచ్చని కొంత అభిప్రాయానికి వచ్చారు. ఇలాంటి వాతావరణమే రాజమండ్రి వద్ద కూడా ఉందని కొందరు చెప్పడంతో ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. అయితే గీతను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించే దాకా అవిశ్రాంతంగా తాము ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని ఆనంద్ ఫౌండేషన్ సభ్యుడు వికాస్ తెలిపారు. గీత తప్పిపోయి పాకిస్తాన్‌కు వెళ్లడం.. ఆ తర్వాత ఇండియాకు రావడం.. కథాంశంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. సినిమాల్లో గీత ఎప్పుడో ఇంటికి చేరింది. పాతికేళ్లు దగ్గరపడుతున్న నిజ జీవితంలో గీత ఎప్పుడు ఇంటికి చేరుతుందో తెలియని పరిస్థితి. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి కటాక్షంతోనైనా గీత సొంతింటికి చేరాలని ఆశిద్దాం.