బ్లాక్‌లో ‘బ్లాక్ ఫంగస్’ మందులు.. ముఠా అరెస్ట్.!

by Sumithra |   ( Updated:2021-06-03 11:47:24.0  )
బ్లాక్‌లో ‘బ్లాక్ ఫంగస్’ మందులు.. ముఠా అరెస్ట్.!
X

దిశ, కుత్బుల్లాపూర్ : కరోనా వైరస్‌తో పాటు ప్రజలను బెంబేలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్ వైరస్ గురించే కొందరికి సరిగా తెలియదు. కానీ ఆ ఫంగస్‌కు మందును కనిపెట్టిందో దొంగల ముఠా. వారి ప్లాన్ ప్రకారం నకిలీ మందులను తయారు చేసినప్పటికీ విక్రయాలు జరుపకముందే పోలీసులు వారిని పట్టుకున్నారు. నకిలీ బ్లాక్ ఫంగస్ మందుల తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సహకారంతోనే ఈ దందాకు వారు శ్రీకారం చుట్టారు.

ముఠా సభ్యులను పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీసులు, మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి పట్టుకున్నారు. గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, బాలానగర్ ఏసీపీ పురుషోత్తమ్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న బ్లాక్ ఫంగస్‌కు.. ప్రగతినగర్‌లోని సెలాన్ ల్యాబోరేటరీ నుంచి మాత్రమే మందులను తయారు చేస్తున్నారు.

అయితే ఆ మందులను ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే అందజేస్తున్నారు. వాటిని కూడా అనుభవం కలిగిన డాక్టర్లు ఇస్తున్నారు. అయితే ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్‌గా విధులు నిర్వహించే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టకు చెందిన డా. ఓబుల్ రెడ్డి అలియాస్ బలరామిరెడ్డి.. ఈ మందులను ప్రైవేట్‌గా విక్రయించి సంపాదన కోసం ఆశించాడు. ఇందుకు గానూ చింతల్ శ్రీనివాస్ నగర్‌లోని శ్రీసాయి నందిని మెడికల్ షాపు యజమాని సాదగారి వికాస్ రెడ్డి(30), అదే షాపులో గతంలో పని చేసిన ప్రసూననగర్ వాసి చిర్ర నాగరాజు(27), సుచిత్ర తేజ రెసిడెన్సీకి చెందిన సుచిత్రలోని మానస మెడికల్ షాపు యజమాని పాపిశెట్టి శ్రీధర్(48)లను ఒక జట్టుగా తయారు చేసుకున్నాడు.

అయితే.. ఓబుల్ రెడ్డి ఈఎస్ఐలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బ్లాక్ ఫంగస్‌కు మందుగా పని చేస్తున్న అంపోటెరిసిన్-బీ లిపోసమ్ ఇంజెక్షన్ (అంబిలన్ 50ఎంజీ) మందులను నందిని మెడికల్ షాపు యజమాని వికాస్ రెడ్డికి విక్రయించాడు. అతను ప్రసూననగర్‌కు చెందిన చిర్ర నాగరాజుకు, సుచిత్రలోని మానస మెడికల్స్ యజమాని శ్రీధర్‌కు విక్రయించాడు. శ్రీధర్ మాత్రం ఆ మందుకు బదులుగా అంబిలన్ మందుల లేబుల్ మాదిరిగానే ఉన్న నకిలీ లేబుళ్లను బోయిన్‌పల్లిలోని శాంతి జిరాక్స్ అండ్ డిజిటల్ ఫోటో ల్యాబ్‌లో తయారు చేయించి అధిక ధరలకు మందులను అమ్మేందుకు ప్రయత్నించాడు. కేవలం రూ.139లకు దొరికే సెట్రాక్సోన్, టాజోబాక్టం (ఫీవర్ ఇన్జెక్షన్)ల బాటిళ్లకు ఈ స్టిక్కర్ అంటించి ఒకొక్కటి రూ. 38 వేల నుంచి రూ.45 వేలకు విక్రయించాలనుకున్నాడు.

ఈ క్రమంలో గురువారం సుచిత్ర మెడికల్ షాపులో ఈ మందులను విక్రయిస్తున్నారనే సమాచారంతో బాలానగర్ డీసీపీ పద్మజ, ఎస్వోటీ డీసీపీ సందీప్‌ల సూచనతో జీడిమెట్ల సీఐ బాలరాజు, పేట్ బషీరాబాద్ సీఐ రమేష్, మాదాపూర్ ఎస్వోటీ సీఐ శివప్రసాద్‌లు సంయక్తంగా దాడులు జరిపారు. దాడుల్లో పీకలాగితే డొంక కదిలిందన్న చందంగా ప్రభుత్వ డాక్టర్ బ్లాక్ దందా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వికాస్ రెడ్డి, చిర్ర నాగరాజు, పాపిశెట్టి శ్రీధర్‌లను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించడంతో వారి వద్ద రూ.18 లక్షల విలువైన 10 అంపోటెరిసిన్ ఇంజెక్షన్‌లు, 35 అంపోటెరిసిన్ నకిలీ ఇంజెక్షన్లు, 3 టాజోబాక్టం ఇంజెక్షన్లతో పాటు రూ. 5 వేల నగదు, 4 సెల్ ఫోన్ లు, 1 వెర్నా కారు, 1 యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. అసలు సూత్రధారి ఓబుల్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ దొంగల ముఠా తయారు చేసిన నకిలీ బ్లాక్ ఫంగస్ మందులను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

మూడు రకాలుగా వైద్యంతో వ్యాపారం..

ఇదిలా ఉండగా ఓబుల్ రెడ్డి ఈఎస్ఐలో జనరల్ ఫిజీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయినప్పటికీ ప్రసూననగర్‌లో స్వంతంగా క్లినిక్‌ను నడుపుతున్నాడు. రెండు వైపులా సంపాదిస్తున్నా డబ్బుపై వ్యామోహం తగ్గలేదు. బ్లాక్ ఫంగస్ మందులను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి మూడు విధాలుగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు.

Advertisement

Next Story