టెలికాం రంగంలో భారీ సంస్కరణలు!

by Harish |
Telecom sector
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం రంగంలో కొనసాగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం కీలక సంస్కరణలను ప్రకటించింది. ఇందులో భాగంగా తొమ్మిది నిర్మాణాత్మక సంస్కరణలు, ఐదు విధాన సంస్కరణలను కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఆటోమెటిక్ మార్గంలో టెలికాం రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిచ్చింది. అంతేకాకుండా రుణ భారాన్ని ఎదుర్కొంటున్న పరిశ్రమలో ఏజీఆర్ బకాయిలకు సంబంధించి 4 ఏళ్ల పాటు టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తాలపై మారటోరియం అవకాశాన్ని ఇచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరాలను వెల్లడించారు.

ఈ సంస్కరణలు మొత్తం టెలికాం రంగం ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిగా మారుస్తాయని, పరిశ్రమను మరింత విస్తృతం చేస్తాయని ఆయన తెలిపారు. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) నిర్వచనాన్ని హేతుబద్దీకరిస్తూ రానున్న రోజుల్లో టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయిస్తున్నామన్నారు. అలాగే, భవిష్యత్తులో స్పెక్ట్రమ్ వేలం వ్యవధి 20 ఏళ్లకు బదులుగా 30 ఏళ్లకు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. దీనివల్ల టెలికాం రంగం నిర్మాణాత్మకమైన వృద్ధి సాధిస్తుందన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేబినెట్ తెలిపింది. కాగా, బుధవారం టెలికాం రంగానికి అనుకూలంగా కేంద్రం నిర్ణయంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు మెరుగ్గా ర్యాలీ చేశాయి.

Advertisement

Next Story