అప్పులు తగ్గాలంటే 2030 వరకూ ఆగాలి : ఎస్‌బీఐ ఎకోరాప్!

by Harish |
అప్పులు తగ్గాలంటే 2030 వరకూ ఆగాలి : ఎస్‌బీఐ ఎకోరాప్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. సుధీర్ఘమైన లాక్‌డౌన్ ప్రభావం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ అప్పులు 87.6 శాతం పెరుగుతాయని ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ ఎకొరాప్ నివేదిక అంచనాలన్ను వెల్లడించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీడీపీ వృద్ధి క్షీణించడం, జీడీపీతో రుణాల నిష్పత్తి పెరగడంతో ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తోందని నివేదిక అభిప్రాయపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రుణాలను తీసుకోవడంతో స్థూల రుణాల మొత్తం జీడీపీలో 87.6 శాతానికి చేరుకోనుందని, ఇందులో బాహ్య రుణాలు 3.5 శాతం ఉండనున్నట్టు నివేదిక తెలిపింది.

అలాగే, రాష్ట్రాల రుణాల రేటు జీడీపీలో 27 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంతేకాకుండా, జీడీపీ సంకోచం వల్ల జీడీపీ నిష్పత్తి రుణాలపై 4 శాతం వరకూ ప్రభావం పడనుందని పేర్కొంది. జీడీపీ రుణ నిష్పత్తి అంటే ప్రభుత్వ రుణాలు, జీడీపీ మధ్య నిష్పత్తి. జీడీపీలో రుణ నిష్పత్తి తక్కువగా ఉంటే కొత్త అప్పులు చేయకుండా ఉన్న అప్పులను చెల్లించేందుకు సరిపడా వస్తువులను, సేవలను ఉత్పత్తి చేసి విక్రయించగలిగే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా జీడీపీతో పోలిస్తే రుణాలు పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. రుణాల్లో పెరుగుదల ఉన్నప్పటికీ రుణస్థాయి దాదాపు స్థిరంగా ఉందని, ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు బాహ్య రుణాల బాధ్యతలను తీర్చేందుకు సరిపోతాయని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. జీడీపీలో రుణాలు 60 శాతానికి చేరేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎఫ్ఆర్‌బీఎం కమిటీ పేర్కొంది. అయితే, కరోనా సంక్షోభం వల్ల ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో 7 ఏళ్లు పడుతుందని, 2030 నాటికి మాత్రమే ఇది సాధ్యపడుతుందని నివేదిక అభిప్రాయపడింది.

Advertisement

Next Story