సీఎస్‌పై హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం.. పది వేల జరిమానా

by Shyam |
somesh kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. పది వేల రూపాయల జరిమానా విధించింది. దీన్ని ప్రధానమంత్రి కొవిడ్ సహాయ నిధికి జమ చేయాలని ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం మాత్రమే కాక వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, కనీసం మినహాయింపు కోరుతూ పిటిషన్‌లు దాఖలుచేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు రెవెన్యూ కార్యదర్శిగా 2016లో జారీ చేసిన జీవో (నెం. 123)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను బుధవారం విచారించిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ పిటిషన్లపై గతంలో పలుమార్లు విచారణ జరిగిందని, ప్రభుత్వ వివరణ కోరుతూ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించిందని, కానీ దాఖలు చేయలేదని, నాలుగేళ్ళుగా ఇదే జరుగుతున్నదంటూ బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించినా పట్టించుకోలేదని గుర్తుచేసింది.

కనీసం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ను కూడా వేయలేదని గుర్తుచేసింది. గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా కూడా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని స్పష్టం చేశామని లేనట్లయితే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో వ్యక్తిగతంగా హాజరుకావాలని వివరించామని, అయినా ఆ రెండూ జరగలేదని పేర్కొన్నది. వీటన్నింటినీ గుర్తుచేసిన బెంచ్ పది వేల రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీన్ని ప్రధానమంత్రి కొవిడ్ సహాయ నిధికి జమ చేయాలని పేర్కొన్నది. వచ్చే నెల 24న జరిగే తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed