ఆ రూ.500 కోట్ల ఖర్చుపై సస్పెన్షన్!

by Anukaran |   ( Updated:2021-09-08 23:22:37.0  )
TS RTC
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీకి అప్పుగా మంజూరైన రూ.500 కోట్లపై సస్పెన్షన్ ఇంకా తెరపడటం లేదు. కార్మికుల సీసీఎస్, రిటైర్మెంట్స్​బెనిఫిట్స్‌తో పాటు చెల్లింపులకు వినియోగించాలని గతంలో నిర్ణయం తీసుకోగా… మంత్రి పువ్వాడ మాత్రం అద్దె బస్సుల కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఇతర అప్పులు తీర్చాలని పట్టుబట్టినట్లు ప్రచారం జరిగింది. వాస్తవంగా ఆర్టీసీకి రెండు నెలల కిందట బ్యాంక్​ఆఫ్ ఇండియా నుంచి రూ.500 కోట్ల రుణం మంజూరైంది. దీన్ని ఆర్టీసీ ఖాతాలో జమ చేశారు. అయితే దీనికోసం వినియోగించాలనే అంశం తేలకపోవడంతో రెండు నెలల నుంచి ఆ సొమ్మును డ్రా తీయడం లేదు. ఈ నెల వేతనాలు కూడా ఇంకా కార్మికులకు విడుదల చేయలేదు.

తేల్చుతారా..?

అప్పుగా వచ్చిన రూ.500 కోట్ల వినియోగానికి సంబంధించి ఎటూ తేలకపోవడంతో వాటిని ఖాతాల్లోనే భద్రం చేశారు. ఇప్పటికే రెండు నెలల నుంచి వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇంకో రూ.500 కోట్లు అప్పు వస్తుందని, మొత్తం రూ.1000 కోట్లతో ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటామని గతంలో మంత్రి పువ్వాడ ప్రకటించారు. కానీ ఇప్పటికే మంజూరైన అప్పును మాత్రం ఏం చేయాలనేది తేల్చడం లేదు. దీనిపై అధికారులు, మంత్రికి మధ్య సయోధ్య కుదరకపోవడంతో సీఎం కేసీఆర్​కు ఫైల్​పంపించారు. సీఎం దగ్గర దాదాపు నెల రోజుల నుంచి ఈ ఫైల్​ పెండింగ్‌లోనే ఉంది.

జీతాలు ఇవ్వండి ప్లీజ్​..!

మరోవైపు ఆర్టీసీ కార్మికుల వేతనాలు ప్రతినెలా ఆలస్యమవుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో గత నెలలో మాత్రం 7వ తేదీలోగా వేతనాలిచ్చారు. కానీ ప్రతిసారి 15వ తేదీ దాటుతోంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఆదాయం మెరుగుపడినా వేతనాలను మాత్రం సకాలంలో ఇవ్వడం లేదు. ఈసారి కూడా ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారు. బ్యాంకు నుంచి వచ్చిన రుణం నుంచి ఎంతో కొంత సర్దుబాటు చేసి వేతనాలు ఇవ్వాలని కార్మికులు మొత్తుకుంటున్నా ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed