‘ద్రవ్యలోటు జీడీపీలో 7 శాతానికి చేరుకోవచ్చు’

by Harish |
‘ద్రవ్యలోటు జీడీపీలో 7 శాతానికి చేరుకోవచ్చు’
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 7 శాతానికి చేరుకుంటుందని, ఇది కేంద్ర బడ్జెట్ అంచనా వేసిన 3.5 శాతం కంటే ఎక్కువని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ (Brickwork Ratings) వెల్లడించింది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడటంతో ఆదాయ సేకరణ దెబ్బతిందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలపై లాక్‌డౌన్ ప్రభావంతో మొదటి మూడు నెలల్లో ప్రభుత్వ ఆదాయ పోకడలను స్పష్టంగా చూపిస్తోందని రేటింగ్స్ సంస్థ నివేదిక పేర్కొంది.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CJA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వం ఆదాయం గతేడాది కంటే చాలా తక్కువగా నమోదైంది. ఆదాయపు పన్ను ద్వారా వచ్చే ఆదాయం 30.5 శాతం తక్కువ నమోదవగా, జీఎస్టీ 34 శాతం తగ్గింది. మరోవైపు, కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి కోసం ఆర్థిక ఉద్దీపనను అందించేందుకు అదనంగా ఖర్చులు చేయడం మూలంగా ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది.

దీనివల్ల ద్రవ్యలోటు తొలి త్రైమాసికంలోనే బడ్జెట్ లక్ష్యంలో 83.2 శాతానికి పెరిగింది. మూడో త్రైమాసికానికి ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ నివేదిక భావిస్తోంది. వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవడంతో మూడో త్రైమాసికం చివరి నాటికి ఆదాయం కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకుంటుందని, పండుగ సీజన్‌లో డిమాండ్ వినియోగం, వ్యయాన్ని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story