టీడీపీ ఎమ్మేల్యేపై వైసీపీ కార్యకర్తల దాడి

by srinivas |
టీడీపీ ఎమ్మేల్యేపై వైసీపీ కార్యకర్తల దాడి
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. విశాఖలో ఆరిలోవ 13వ వార్డు(రామకృష్ణాపురం)లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన రామకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే, టీడీపీ కార్యకర్తలపై కొబ్బరి చిప్పలు, రాళ్లు, చెప్పులతో దాడికి దిగారు. ఇందులో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలంటూ వెలగపూడి రామకృష్ణబాబు అక్కడే బైఠాయించారు.

వైఎస్సార్సీపీ నేతలు అభివృద్ధి నిరోధకులనీ, రౌడీలతో తమపై దాడులు చేయించారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తమకు రౌడీయిజం నేర్పలేదనీ, అభివృద్ధిని మాత్రమే నేర్పారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు మోకాలడ్డడం వైఎస్సార్సీపీ సంస్కృతి అని విమర్శించారు. కాగా, దాడికి పాల్పడిన అధికార పార్టీ కార్యకర్తలు తమ ప్రాంతానికి చెందినవారు కాదని రామకృష్ణాపురం వాసులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed